calender_icon.png 14 January, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వ రాయితీలు కల్పించాలి

13-01-2025 06:43:12 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తొలి తరం తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వపరంగా రాయితీలు కల్పించి ఆదుకోవాలని తెలంగాణ తొలి తరం ఉద్యమకారులు కోరారు. సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. 1968 లో బెల్లంపల్లి ప్రాంతంలో టి. నాగయ్య ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పోరాటం ప్రారంభించామన్నారు. అనేకసార్లు పోలీసుల చేతిలో నాటే దింపలు తిని జైలకు కూడా వెళ్లి వచ్చామన్నారు. 1969 లో ఉద్యమకారులుగా అరెస్టయి జైలుకు వెళ్ళామన్నారు. తొలిదశ ఉద్యమంలో 369 మంది పోలీసు కాల్పుల్లో మరణించడం దేశంలోనే చారిత్రక ఘట్టంగా నిలిచిందన్నారు. మలిదశ సకలజనుల సమ్మెలో కూడా తాము పాల్గొన్నామన్నారు. గత కేసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా మోసం చేసిందని ఆవేదన చెందారు. తెలంగాణ ఉద్యమకారుడు నలుమాసు స్వామి తమ కేసును వాదించి హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేశారని చెప్పారు.

ప్రస్తుతం తాము వయోభారంతో, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కాకా వెంకటస్వామి అడుగుజాడల్లో ముందు నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి తరం తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలిచి ఆదుకోవాలని వారు వేడుకున్నారు. తమకు భూమి, రిజర్వేషన్, తమ పిల్లలకు విదేశీ ప్రయాణాలు రాయితీ, ఆరోగ్యశ్రీ సేవలను అందించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు జంజీరాల రాజం, జాగాటి బాపు, తోకల లింగయ్య, కే. ఎం సత్యనారాయణ, పంగ బొంద్యాలు, రాజం రెడ్డి, జహంగీర్ పాషా, మలిగొండ సత్యనారాయణ, జెర్రీ బోతుల మొగిలి, కాసర్ల పెద్దులు, సింగారావు రామచందర్, ఈట మల్లేష్, గోసిక లక్ష్మి, పబ్బెల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.