calender_icon.png 15 October, 2024 | 2:47 AM

టేకులపల్లి టు కాకినాడ!

15-10-2024 12:17:14 AM

రాష్ట్రాలు దాటుతున్న పీడీఎస్ బియ్యం

అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కుల ఇష్టారాజ్యం

దందాలో రేషన్ డీలర్లే కీలక సూత్రదారులు

కొత్తగూడెం, అక్టోబర్ 1౪:  అధికారుల పట్టింపులేనితనంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అడిగేవారే లేకపోవడంతో జిల్లాలోని రేషన్ బియ్యం పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఈ దందాకు సూత్రదారులు, పాత్రదారులు రేషన్ డీలర్లే కావడం గమనార్హం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు వాహనాల ద్వారా రవాణా చేస్తూ అక్రమార్కులు జేబులు నింపుకొంటున్నారు. సివిల్ సప్లు అధికారులు పట్టింపులేనితనంతో దందా చేసేవారి ఇష్టారాజ్యమైంది.

ఓవైపు రేషన్ దుకాణంలో కొనుగోలు చేసిన లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి, అమ్ముకునే వారు కొందరైతే, నేరుగా రేషన్ దుకాణాల నుంచి అమ్మే డీలర్లు కొందరున్నారు. పేదలకు కడుపు నింపాల్సిన బియ్యం కాకినాడ తీరానికి చేరుతోంది. 

సస్పెన్షన్.. బాధ్యతల అప్పగింత 

డీలర్లపై కోపం ఉన్నవారు అప్పుడప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు అధికారులు దాడులు చేస్తున్నారు. కేసు నమోదు చేయడం, ఆ తర్వాత డీలర్ షిప్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం పరిపాటైంది. కొద్ది రోజుల తర్వాత అదే డీలరుకు మళ్లీ దుకాణం బాధ్యతలు అప్పగించడం షరామామూలైంది.

ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు రేషన్ దుకాణాల్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డు లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. అదే రీతిలో పదో తేదీ మొదలుకొని 20 వరకు అక్రమ రవాణాకు శ్రీకారం చుడుతుంటారు.

వీరి ఆగడాలను అరికట్టేందుకు సివిల్ సప్లు అధికారులు నామమాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకొంటున్నారు. కొందరు రేషన్ బియ్యం రవాణాను అడ్డుకునేందుకని రాత్రివేళల్లో కాపుకాయడం, అక్రమార్కుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

31 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత 

కామారెడ్డి/వనపర్తి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం 31 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నా రు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలోని దివ్యనవ్య రైస్ మిల్లులో రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యాన్‌ను వనపర్తి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. 20 క్వింటాళ్ల బియ్యం, వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రం లో నంగనూరి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్రమం గా నిల్వ ఉంచిన 11 క్వింటాళ్ల రేషన్ బియ్యా న్ని మాచారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. 

అర్ధరాత్రి దాటాక షురూ

రేషన్ బియ్యం తరలింపు ప్రతి రోజు అర్ధరాత్రి దాటాకే మొదలవుతోంది. బియ్యం లబ్ధిదారులకే సరఫరా చేసినట్టు లెక్కలు చూపి పెద్ద మొత్తంలో ప్రభుత్వం సరఫరా చేసిన గన్నీ సంచుల్లోనే కొందరు డీలర్లు అమ్మకాలు చేపడుతున్నారు. కొందరు వ్యక్తులు రేషన్ బియ్యం సేకరణే వృత్తిగా మార్చుకొని రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సరఫరా చేసే రోజుల్లో సంచులతో దుకాణాల వద్ద నిరీక్షిస్తుంటారు.

లబ్ధిదారులకు నగదు ఇస్తూ బియ్యం సేకరిస్తారు. సేకరించిన బియ్యాన్ని దళారులకు అమ్ముకుంటారు. దళారులు మళ్లీ కాకినాడకు రవాణా చేసే అక్రమార్కులకు విక్రయిస్తుంటారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి, ‘మామూలు’గా వదిలేస్తున్నారు.