calender_icon.png 26 October, 2024 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారులకు ఒరిగిందేంటి!

23-05-2024 12:05:00 AM

తెలంగాణ వస్తే బతుకులు మారిపోతాయని ఆశ పడ్డాం! ఉద్యమం కోసం జీవితాన్ని అంకితం చేశాం! ప్రభుత్వ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచాం! లాఠీ దెబ్బలకు వెరవలేదు! కేసుల్లో ఇరుకున్నాం! రేయింబవళ్లు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగాం! ఉద్యమానికి ఆకర్షితులై విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్నాం! పెళ్లాం బిడ్డలను వదిలి నెలల తరబడి జైలు జీవితాన్ని అనుభవించాం! ఉద్యమ సమయంలో వీరులు, శూరులు, త్యాగధనులు అంటూ పొగిడిన వారే.. ఆ తర్వాత దూరం పెట్టారు! సాయం కోసం వెళ్తే.. నేతల ఛీత్కరింపులు అవమానాలు, నిరాధారణ! అప్పట్లో జై తెలంగాణ అని నినదించిన నోళ్లు.. ఇప్పుడు ‘అన్నా.. జర సార్’ ని కలిపించవే’ అని ప్రాధేయపడే దుస్థితికి చేరారు. వాళ్లే.. తెలంగాణ ఉద్యమకారులు..! కామారెడ్డికి చెందిన తొలి, మలి దశ ఉద్యమకారుడు టేక్రియాల్ మల్లన్న తన ఎనిమిది దశాబ్దాల జీవితానుభవాలను ‘వీర తెలంగాణ’తో పంచుకున్నారు..!!

రాజకీయ నాయకుల దృష్టికి..

నాదగ్గర డబ్బులు లేకున్నా మిత్రుల సహకారం ఎక్కువగా ఉండేది. అలా కబడ్డీ క్రీడాకారునిగా  జాతీయ స్థాయి క్రీడల్లో కామారెడ్డి టీం పాల్గొని దేశస్థాయిలో పేరు సంపాదించింది. అలా నా పేరు కామారెడ్డి ప్రాంతంలో అప్పటి రాజకీయ నాయకుల దృష్టికి వెళ్ళింది. ఎన్నికలు జరిగినప్పుడు పటేల్, ఇతర నాయకులు వచ్చి నన్ను గ్రామానికి తీసుకెళ్లేవారు. అప్పటి చక్కెర శాఖ మంత్రిగా ఉన్న తాడూరి బాలగౌడ్  గారు నా సేవలను గుర్తించి సమితి ప్రెసిడెంట్‌గా ఏక గ్రీవంగా చేస్తానని మాట ఇచ్చారు. అలా బాలగౌడ్‌కు నమ్మిన బంటుగా ఉండేవాణ్ని. సమితి ప్రెసిడెంట్‌గా ప్రకటించాల్సిన సమయంలోనే కామారెడ్డి ప్రాంతంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడ్డు తగిలారు. నన్ను సమితి ప్రెసిడెంట్‌గా చేస్తే ఎన్నికల్లో మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో బాలగౌడ్ చేసేదేమీ లేక నాకు నచ్చజెప్పి విరమింప చేశాడు. 

కేసీఆర్ ఉద్యమకారులను మరిచిపోయిండు..

కామారెడ్డి న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రం కోసం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. వారితో కలిసి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాను. గ్రామ గ్రామాన తిరుగు తూ ప్రజలను చైతన్యవంతం చేశాం. కేసీఆర్ ఇచ్చిన ఉద్యమ పిలుపుతో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేవాణ్ని. రోడ్డు దిగ్బంధాలు, రైలు రోకోలు, విద్యుత్ అధికారుల నిర్బంధం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అలా నాపై ఎన్నో కేసు లు నమోదు అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తో పాటు 12 మందిపై రైల్వే పోలీసులు కేసులను నమోదు చేశారు. అందులో నాపేరు కూడా ఉంది. ఉమ్మడి నిజాంబాద్ జిల్లాగా ఉన్నప్పుడు కామారెడ్డి జెడ్పీటీసీగా ఎన్నికయ్యాను. జెడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేస్తూ సీల్ కవర్ కూడా కేసీఆర్ పంపించారు. అప్పటి ఎంపీ ఆలే నరేంద్ర సీల్ కవర్‌లో నా పేరును జెడ్పీలో ప్రకటించాల్సి ఉండే. కానీ మాజీ జెడ్పీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి నాకు మాట ఇచ్చి మాట తప్పారు.

బాల్కొండకు చెందిన గంట సదానందంను జెడ్పీ చైర్మన్‌గా చేశారు. నోటికాడికి వచ్చిన బుక్క చేజారిపోయిందన్నట్లుగా తనకు రెండుసార్లు తెలంగాణ సమితి అధ్యక్షుడిగా, జెడ్పీ చైర్మన్‌గా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. ఉద్యమ ద్రోహులు వచ్చి ఉద్యమకారులను చిన్నచూపు చూస్తున్నారని పలుమార్లు కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన, అయినా వాళ్లు పట్టించుకోలేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు పదవులు ఇయ్యలేదు. ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు. అసలు ఉద్యమకారులనే మరిచిపోయిండు. అప్పుడే అర్థం అయింది.  తెలంగాణ ఉద్యమ పార్టీ చరిత్ర ముగిసిందని, తమది ఇక రాజకీయ పార్టీ అని కేసీఆర్ ప్రకటించినప్పుడే ఉద్యమకారుల త్యాగాలన్నీ కాల గర్భంలో కలిసిపోయాయి. అయినా, తమకు ఎక్కడైనా న్యాయం జరుగుతుందేమోనని ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నాం. 

నా పేరు టేక్రియాల్ మల్లన్న. మాది కామారెడ్డి. నా పేరు మా జిల్లాలో  తెలియని వారు ఉండరు. 12 ఏళ్ల వయసులో నేను పలక బలపం పట్టాను. అప్పటివరకు బర్రెల కాపరిగా గంగారం పటేల్ ఇంట్లో పనిచేసేవాణ్ని. ఓ సారి పటేల్ ‘చదువుకుంటావురా’ అని అడిగారు. చదువుకుంటానని చెప్పడంతో గ్రామంలోనే ఒకటి, రెండో తరగతి చదువుకున్నాను. తర్వాత మూడవ తరగతి కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డిలో మిషనరీ స్కూల్లో చేరాను. చదువుకోవాలని తపన ఎక్కువగా ఉండేది. దాంతో మిషనరీ స్కూల్లో పనిచేసే మహిళా టీచర్ పుస్తకాలు కొనిస్తే చదువు కొనసాగించాను. పదవ తరగతి కామారెడ్డిలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదివాను. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడే తెలంగాణ తొలి ఉద్యమం వచ్చింది. అప్పటికే స్కూల్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక అయ్యాను.  తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో మిత్రులతో కలిసి పాల్గొన్నాను. అప్పుడే పోలీసు తుపాకులతో బాగా కొట్టారు. ఆ నొప్పుల బాధ నేటికి తగ్గలేదు. తర్వాత కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేశాను. డిగ్రీ చదివే సమయంలో కళాశాల ప్రెసిడెంట్‌గా కూడా నన్ను ఎన్నుకున్నారు. అప్పుడు కళాశాలలో ఎన్నికలు కూడా ఓట్లతో జరిగేవి. ఇప్పుడు జరుగుతున్న సాధారణ ఎన్నికల మాదిరిగా కళాశాల ఎన్నికలంటే ఓట్లు వేసి గెలిపించుకునేవారు. 

చేజారిపోయిన పదవులు..

తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ కాలంలో పోలీస్ దెబ్బలు, కేసులు, జైలు పాలు కూడా అయ్యాను. దళితుడిని అనే కారణంచేతో.. ఏమో తెలియదు కానీ చాలా పదవులు నోటిదాక వచ్చి చేజారిపోయేవి. తెలంగాణ సమితి అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం వచ్చినట్లు వచ్చి చేజారిపోయాయి. తర్వాతి కాలంలో గ్రామంలో సర్పం చ్‌గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహించాను. ఇప్పటికీ గ్రామస్థుల నాకు మద్దతు ఇవ్వడం ఆనందకరం. ఇక మలిదశ ఉద్యమంలో ఊరు ఊరు కేసీఆర్‌తో తిరిగాను. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను మరిచిండు. కామారెడ్డి ప్రాంతంలో ఏ ఉద్యమం నడిచిన ముందుండి నడిపించాను. ఇదిగో ఇప్పుడు ఇలా  బర్రెలను కాస్తూ జీవనం సాగించాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మన నీళ్లు.. ఉద్యోగాలు.. సాధించుకోవచ్చని ఆరాటంతో పోరాటం చేశాను. తెలంగాణ వస్తే బతుకులు, భవిష్యత్ తరాలు బాగుపడతాయని భావించాను. కానీ పోరాడిన తెలంగాణ ఉద్యమకారులు బతుకులు కూడా ఏ మాత్రం మారలేదు. ఇంకా దీనస్థితిలోనే ఉన్నాయనడానికి నా జీవితమే ఉదాహరణ. 

అందరు సల్లగుంటే చాలు..

ప్రస్తుతం నేను ఉదయం నాలుగు గంటలకు లేచి బర్రెలకు కుడిది పోసి, పాలు పిండి.. బర్రెలను బావి కాడికి తీసుకువచ్చి గడ్డి మేపుతున్నాను. 11 గంటలకు మళ్ళీ ఇంటికి వెళ్లి భోజనం చేసి ఎవరికన్నా పని ఉంటే వాళ్లు పిలిస్తే పోయి వస్తాను. సాయంత్రం మళ్ళీ బర్రెలను మేపుతూ కాలం గడుపుతున్నాను. ఇప్పటికీ గ్రామంలో నా మాటను వింటారు. గ్రామానికి నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు తెచ్చి రోడు,్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కట్టించాను. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాను. రెండు నీళ్ల ట్యాంకులు కట్టించి గ్రామాన్ని అభివృద్ధి చేశాను అనే ఫీలింగ్ మాత్రం ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కామారెడ్డి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాడని అనుకున్నాను. కనీసం సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి కామారెడ్డిలో జరగలేదు. ఇప్పటికైతే ఎవరిని చేయి చాచి బతకడం లేదు. అంబేద్కర్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను. ఎవరికి ఏ ఆపద వచ్చిన తనను పిలిస్తే వెళ్లి వస్తాను. టేక్రియాల్ మల్లన్న వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దన్నది నా ఉద్దేశం.

డబ్బులు పదవులు వస్తుంటాయి పోతుంటాయి. మంచి పేరును కాపాడుకోవాలనదే నా తపన. పిల్లలు కూడా నేను చెప్పినట్లు విని ఎవరి పని వారు చేసుకుంటున్నారు. నాకు రెండేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోమని సలహా ఇచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తాను భూపతిరెడ్డికి పరిచయస్తున్ని కావడంతో పాటు తాను బీదవాన్ని, దళితున్ని అన్న విషయం భూపతి రెడ్డికి తెలుసు. అందుకే డబ్బులు తీసుకోకుండానే వైద్యం చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ దగ్గరుండి ఆసుపత్రికి వచ్చి డాక్టర్ తోటి మాట్లాడి ఆపరేషన్ చేయించిండు. అప్పట్నుంచి మంచిగా నడుస్తున్న. అందరితో మంచిగా ఉండి  నోటి మాట సల్లగా ఉంటే అందరూ సల్లగా చూస్తారనే నమ్మకం నాది. పదవులు వచ్చి చేతికాడికి వచ్చి పోయినయి కానీ పర్వాలేదు. మల్లన్న పేరు మాత్రం కామారెడ్డి ప్రాంతంలో తెలియని వారు లేరు ఇదే నాకు సాలు.

- ఎం. శ్రీనివాస్‌రెడ్డి  కామారెడ్డి