08-04-2025 06:40:34 PM
ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ అధికారి..
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద బడుగు బలహీన వర్గాలకు కడుపునిండా భోజనం అందించేందుకు సన్న బియ్యం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టగా అధికారులు క్షేత్రస్థాయిలో పథకం తీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా మండల తహసిల్దార్ సతీష్ కుమార్ రెవెన్యూ అధికారులతో కలిసి పట్టణంలోని ఒకటో జోన్ కు చెందిన సన్న బియ్యం లబ్ధిదారురాలు పొన్నగంటి సుగుణ - లింగయ్య దంపతుల ఇంట్లో సన్నబియ్యంతో చేసిన వంటను మంగళవారం రుచి చూశారు. ఈ సందర్బంగా లబ్ధిదారురాలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేసిన సన్నబియ్యంతో చేసిన వంటను రుచి చూశారు.
ఈ సందర్బంగా తహశీల్దార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ... ప్రభుత్వం ధనవంతులు తినే సన్నబియ్యంను నిరుపేదల కడుపు నింపాలనే ఆశయంతో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తుందని ఆన్నారు. కార్డుదారులు సకలంలో చౌక ధరల దుకాణం వెళ్లి బియ్యం తీసుకొని సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే బియ్యం పంపిణీలో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా మండల రెవెన్యూ అదికారులు తమ ఇంటికి వచ్చి భోజనం చేయడం పట్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహశీల్దార్ రవీందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణపతి రాథోడ్ లు పాల్గొన్నారు.
ఆదర్శంగా నిలుస్తున్న తహసిల్దార్
రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని మండల తహసిల్దార్ సతీష్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించడమే కాకుండా లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాకుండా లబ్ధిదారులకు అందించిన సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని రుచి చూశారు. సన్న బియ్యం పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారి ప్రజల మన్ననలను పొందారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్ని మండల స్థాయి అధికారులు ఈ విధంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయడం ద్వారా పథకం విజయవంతం అవుతుందని అదే స్థాయిలో అధికారులు ప్రజలకు మరింత దగ్గర అయ్యే అవకాశం ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రతి అధికారి ప్రభుత్వ పథకాల అమలుకు అంకితభావంతో కృషి చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు 100% విజయవంతం అవుతాయని పలువురు భావిస్తున్నారు. సన్నబియ్యం పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తహసిల్దార్ మండలంలోనే ఆదర్శ అధికారిగా నిలిచారని చెప్పవచ్చు.