calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యసనాల మోజులో టీనేజీ యువత

02-04-2025 12:00:00 AM

ఆధునిక శాస్త్ర సాంకేతిక వ్యవస్థ సామాజిక మాధ్యమాల రూపకల్పనకు దారితీసింది. నేడు ప్రపంచవ్యాప్తం గా ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి ఉంటున్న ది. దీంతో గాడి తప్పుతున్న యువత తల్లిదండ్రులకే కాదు, యావత్ దేశానికే పెను భారం అవుతున్నారు. సెల్‌ఫోన్, టీవీలలో ఆశ్లీలత, ఆన్‌లైన్ గేములు, మార్కులు ర్యాంకుల ఒత్తిడి, యాంత్రిక జీవితాలు వంటివాటివల్ల నేరమయ జీవితానికి టీనే జ్ పిల్లలు అలవాటు పడుతున్నారు.

పాఠశాలలు, కుటుంబాలు, తల్లిదండ్రులే ఈ ప్రమాద పరిస్థితుల నుంచి వారిని రక్షించాలి. మన చుట్టూ అనేక సామాజిక రుగ్మ తలు ఆవరించి ఉన్న నేపథ్యంలో మద్యం, మత్తు పానీయాలు, ధూమపానం, క్లబ్బు లు పబ్బులు, ఈవెంట్లు వంటి అనారోగ్యకర ధోరణులను పెంపొందించే వాతావ రణం దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్నది.

తప్పుడు పనుల కారణంగా ఒకవైపు యువత, వృద్ధతరం, మధ్యవయస్కులు అందరూ కూడా అవినీతి తదితర నేరాల రొంపిలో కూరుకుపోతుంటే నేటి టీనేజ్ యువత అందుకు మినహాయింపు కాకపోవడం అత్యంత విచారకరం. ఉత్తమ సమా జం నిర్మాణం కావలసిన తరుణంలో నేటి బాలలు నేరాల రొంపిలో బాధ్యతా రాహిత్యంతో హత్యలు ఆత్మహత్యలు, హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారంటే ఇం తకు మించిన దుస్థితి మరొకటి ఉండదు.

నేటి పిల్లలు ఏకంగా ఉపాధ్యాయులపైనే దాడి చేసే ఘోరం ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో తుపాకితో కాల్చి చంపిన దుర్ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా ఎక్కడో అమెరికాలో కాదు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల జరిగిన పలు సంఘటనలు ఒళ్ళు జలదరింప చేస్తున్నాయి. 

10వ తరగతిలోపు పిల్లలు కూడా!

పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు విద్యార్థిని మందలించిన పాపానికి మధ్యప్రదేశ్‌లోని చతరపురు జిల్లాలో ఓ ప్రిన్సి పాల్‌ను 12వ తరగతి విద్యార్థి 2024 డిసెంబర్ మొదటివారంలో కాల్చి చంపిన ఘటన దేశంలోని నేటి బాలల్లో నెలకొంటున్న నేర ప్రవృత్తిని చాటుతున్నది. కొన్ని సందర్భాలలో అయితే బాలికలపైన కొంద రు బాలురు అత్యాచారానికి పాల్పడడం, మద్యం మత్తు పానీయాలు, గంజాయి వంటివాటికి పాఠశాలల్లోనే అలవాటు పడి తోటివాళ్లను ఇబ్బంది పెట్టిన సందర్భాలు రోజురోజుకు వెలుగు చూస్తున్నా యి.

10వ తరగతిలోపు పిల్లలే అత్యాచారానికి పాల్పడిన సన్నివేశాలలో విచారణ అధికారులు ప్రశ్నించిన సందర్భంలో ‘తమకు ఈ ధైర్యం రావడానికి టీవీలు సెల్ ఫోన్లలోని అశ్లీల సన్నివేశాలు కారణమని, వాటివల్లే తమకు విషయం తెలిసిందని’ స్పష్టంగా చెప్పడం గమనార్హం.

యాంత్రిక జీవితంలో తల్లిదండ్రులు తమ పిల్లలను సరిగా పట్టించుకోక పోవడం, వసతి గృ హాల్లో వేసి తమ బాధ్యతను మరిచి చేతు లు దులుపుకోవడం, చిన్ననాటి నుంచే సెల్‌ఫోన్‌లను పిల్లలకు అందుబాటులో ఉంచడం వంటివి ప్రధాన కారణాలుగా కనబడుతున్నాయి.

టీవీలలో వచ్చే ప్రసారాలు, సీరియళ్లు, ఇతర కార్యక్రమాలలో మద్యపానాన్ని, ఇతర దురలవాట్లను, దొంగతనం వంటి నేరాలు, హత్య అత్యాచార సన్నివేశాలు సైతం ఈ రకమైన పరిస్థితికి దారితీస్తున్నాయి. 

ఇక విద్యారంగంలో నెలకొన్న కొన్ని సంస్థాగత లోపాలు, యాంత్రిక బోధన, నైతిక విలువలకు ఆస్కారం లేనటువంటి సందర్భాలు, అవకాశవాదం, స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఆలోచనా ధోరణులు కూడా టీనేజ్ పిల్లలలో నేర స్వభా వాన్ని మరింతగా పెంచుతున్నవి.

ర్యాంకు లు మాత్రమే పరిమితం కావడం, అందుకోసం పిల్లలపై పెనుభా రం పడుతుండడం, ర్యాంకులను సాధించడానికి కొన్ని తప్పుడు మార్గాలకు పాల్పడ డం, విచక్షణ మరిచి ప్రవర్తించడం కూడా వారిలో అనైతిక పనులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఇటీవల భారతదేశ వ్యాప్తంగా సమాజం నిండా ఆవతరించిన డ్రగ్స్ మత్తు మందులు విద్యాసంస్థల్లోకి కూడా ప్రవేశిస్తున్నాయి.

దాంతో యువతరం తాత్కాలిక సుఖం కోసం, ఆత్మతృప్తి కోసం వాటికి అలవాటు పడి బానిసలవుతున్నా రు. ఆ క్షణకాలంలో ఎంతటి తప్పుడు పనులకైనా పాల్పడడాన్ని గమనించినప్పుడు నేటి టీనేజ్ పిల్లలు ఈ రొంపిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం సామాజిక వ్యవస్థ అని మనకు అర్థమవుతుంది.

బాల్యదశ నుంచే దిద్దుబాట్లు

అధికారిక లెక్కల ప్రకారం 2022లో మైనర్ విద్యార్థులు చేసిన నేరాలు, పాల్గొ న్న సంఘటనల కారణంగా భారతదేశంలో 30 వేలకుపైగా కేసులు నమోదైనా యి. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ లో మహిళలపట్ల లైంగిక దాడులు, ఆగడాలను ఆపడం కోసం ఏర్పరచిన షీ టీమ్స్ కు ఇటీవల హైదరాబాద్‌లో మహిళలను వేధిస్తూ పట్టుబడిన వారిలో యువతకంటే బాలురే పెద్దసంఖ్యలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

సామాజిక వికృత రూపం కారణంగా ఇన్ని రకాల విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయంటే ఉత్తమ భవిష్యత్తుకు పిల్లలు ఆదిలోనే తప్పుదారి పడుతున్నారన్నమాట. బాల్యదశలోనే తప్పులు సవ రించి ఉత్తమ ఆలోచనలను నింపి, నేర స్వభావాన్ని తుడిచి వేయవలసిన అవస రం చాలా ఉన్నది. ఇందుకు చట్టాలతోపాటు ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యా యులూ కీలక పాత్ర పోషిస్తారు.

నైతిక విలువలకు అధిక ప్రాధాన్యం ఇవ్వగలిగిన పాఠ్యప్రణాళికల రూపకల్పన జరగాలి. అన్ని వర్గాల పిల్లలు కలిసి జీవించే కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా సమైక్యతను, సమభావనను సాధించగ లం. పాఠశాలల్లో ఉత్తమ బోధన, తగిన స్థాయిలో ఉపాధ్యాయుల చొరవ కృషి ప్రత్యేకంగా కొనసాగించాలి. తల్లితండ్రులు కూడా తమ పిల్లలకోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.

వారి ఆలోచనా సరళిని, దినవారీ పనులను, మానసిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. సమాజంలోని అపసవ్య, అశ్లీల ధోరణులపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. నేరాలకు ఆస్కారం లేని ప్రశాంత వాతావరణం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. 

అందరిపైనా సమాన బాధ్యత

సినిమాలు టీవీ ప్రసారాలతోపాటు డ్ర గ్స్ (మత్తు పదార్థాల)ను అందుబాటులో లేకుండా చేయాలి. వాటిని సరఫరా చేసే నేరస్థులపైన ఉక్కుపాదం మోపాలి. ఇలా ప్రభుత్వ యంత్రాంగం తన నిబద్ధతను చాటుకున్నప్పుడు బాల్యదశలోనే యువతను కట్టడి చేయవచ్చు. దుర్ఘటనలు జరిగిన తర్వాత పోలీసులు విచారణ జరిపే బదులు అవి జరగకుండా ముందు జాగ్ర త్త వహించాలి.

అందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి. ఈ క్రమంలో పోలీసులది ఎంతో పెద్ద పాత్ర. అప్పుడే పేద కుటుంబాలకు, వారి పిల్లలకు తగిన భరోసా దక్కుతుంది. తాత్కాలిక ఆవేశాల కు అల్పకాలిక ప్రయోజనాలకు ఆస్కారమివ్వకుండా శాశ్వతమైన అభివృద్ధివైపు పిల్లలను నడిపించడానికి వీలవుతుంది.

ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో అంతకుమించిన ఆవశ్యకత తల్లిదండ్రులు, సమాజం, పాఠశాల ఉపాధ్యాయులపైనా ఉంటుంది. ఉత్తమ పాఠ్య ప్రణాళికలతోపాటు ఆదర్శవంతమైన విద్యావిధానం కావాలి. ఈ రకంగా బాల్య దశలో నేర స్వభావాన్ని అడ్డుకోవచ్చు. 

గురుశిష్య సంబంధాన్ని గౌరవప్రదంగా కొనసాగేలా చూడగలిగితే ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా ఉంటాయి. ‘విద్యార్థులను తీర్చిదిద్దడానికి తన సర్వ స్వం వెచ్చించిన గురువుని అంతం చేసినటువంటి దుష్ట సంస్కృతి ఇంకానా, ఇకపై సాగదు’ అని ప్రతి ఒక్కరు నినదించాలి. ఇవన్నీ పూర్తి చిత్తశుద్ధితో ఆచరణలోకి వచ్చినప్పుడే నేటి బాలలు, రేపటి భావిభారత పౌరులుగా సన్మార్గంలో పయనించే భారతావనికి అవకాశం దక్కుతుంది.

పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారన్న వాటిపై పెద్దలు విధిగా కన్నేసి ఉంచాలి. సోషల్ మీడియా వల్ల కలిగే లాభనష్టాలను తరగతి గదిలో పాఠ్యాంశాల ద్వారా పిల్లలకు వివరించాలి. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమాజంలోని ప్రతి ఒక్కరం బాధ్యతగా వ్యవహరించాలి.