calender_icon.png 18 November, 2024 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేజోమయంగా తీజ్ ఉత్సవాలు

28-07-2024 12:05:00 AM

తెలంగాణలోని అన్ని గిరిజన తండాలు, గూడేలు, బంజారా కాలనీలలో లంబాడీల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. అవి ప్రకృతిని ఆరాధిస్తూ గొప్పగా పూజించే ‘తీజ్’ పండుగ ఉత్సవాలు. ఆధునిక ప్రపంచంలో కాలం మారుతున్న కొద్దీ తమ జీవన రీతులను కాపాడుకుంటూ ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. గిరిజనుల ప్రతి పండుగలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇవన్నీ ప్రకృతితో ముడిపడి, ప్రకృతిని ఆరాధించేవి. ఒక్కో దేవత ఒక్కొక్క రకంగా తండాలను రక్షిస్తుందని లంబాడీలు నమ్ముతారు. కఠోర నియమాలు, డప్పుల మోత, కేరింతలు, ఊరే గింపులు, ఆటపాటలు, అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాలు, బావమరదళ్ల అల్లరి చేష్టలు, భక్తిశ్రద్ధలు.. అన్నిటి మేళవింపుతో 9 రోజులపాటు పెళ్లి కాని లంబాడీ యువతులు జరుపుకునే ఈ వేడుక ‘బతుకమ్మ’ను పోలి ఉంటుంది.

గోధుమ మొలకలను 8 రోజులు పూజిం చి, 9వ నాడు ప్రజలంతా ఊరేగింపుతో వెళ్లి నిమజ్జనం చేస్తారు. పెళ్లి కాని ఆడపిల్లలే ముందుండి నిర్వహిస్తారు. పెద్దలు, సోదరులు సహకరిస్తారు. వర్షాకాలం ప్రారంభంలోనే పత్తి చేన్లలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్ ’ అంటారు. గోధుమ మొలకలనూ ‘తీజ్’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో ఆలంకరించినట్లే తీజ్‌లో గోధుమ మొలకలను పూజించడం సంప్రదాయం.

వర్షాకాలంలో నాట్లు పూర్తయ్యాక ఈ వేడుకను మొదలుపెడతారు. పెళ్లి కానీ యువతులు, మహిళలు ఆటలు ఆడి, పాటలు పాడుతారు. ఆడపిల్లలంతా ఇల్లి ల్లూ తిరిగి పెద్దవాళ్ల ఆశీర్వాదాలు పొందుతారు. ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరి స్తారు. అనంతరం ఆడపిల్లలు గోధుమలు, శనగలు, ఇతరత్రా సామాన్లు తెస్తారు. నానబెట్టిన మొలకలను మొలకెత్తించడానికి దూసేరు తీగలతో అల్లిన బుట్ట(ఓల్డి)లను తెస్తారు. పుట్టమన్ను తెచ్చి దానిలో మేక ఎరువు కలుపుతారు. లంబాడీల దేవతలు దండి యాడి, తుల్జా భవాని, సేవాభాయ, సేవాలాల్ మహారాజ్, సీత్లా భవాని, పేర్లతో తయారుచేసిన బుట్టలలో మొదటగా పెద్దమనిషి నాయక్‌తో ఎరువు కలిపిన మట్టిని బుట్టలో పోస్తారు. తరువాత నానబెట్టిన గోధుమలు బుట్టలో చల్లుతారు.

ప్రతీ కార్యం ఆట పాటలతోనే ఘనంగా సాగుతుంది. ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క బుట్ట పెడతారు. ఈ బుట్టలన్నీ ఒకేచోట ఉండేందుకు పెద్దమనిషి నాయక్ ఇంటిముందు పందిరి వేస్తారు. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజూ మూడు పూటలు పందిరిపై పెట్టిన బుట్టలలో బాయి నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఈ నీరు అత్యంత పవిత్రమైందని, దీనివల్ల శుభం జరుగుతుందని వారి నమ్మకం. నిమజ్జనానికి బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. డప్పు చప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ, లంబాడీ వేషధారణతో నృత్యాలు చేస్తారు.

పెద్దమనిషి నాయక్ తీజ్ బుట్టలను పెళ్లికాని ఆడపిల్లలకు అందిస్తారు. వారు అన్నదమ్ముల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇది రాఖీ పండుగను పోలి ఉంటుంది. తీజ్ బుట్టలను పట్టుకొని నిమజ్జనానికి బయలు దేరుతారు. ఇదొక అద్భుత సన్నివేశం. ప్రతి ఏటా ఆగస్టు నెలలో శ్రావణమాసంలో తీజ్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. సీత్లా భవాని, తీజ్ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక తేదీని కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన లంబాడీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

 లకావత్ చిరంజీవి నాయక్