08-04-2025 12:00:00 AM
సంగారెడ్డి(మెదక్), ఏప్రిల్ 7 (విజయక్రాంతి) మహిళల శక్తితో పాటు టెక్నాలజీ తోడైతే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సోమవారం నమో డ్రోన్ దిది కిసాన్ డ్రోన్ ఆపరేటర్ శిక్షణపై హేటిరో, సింక్రో, ఫ్లయింగ్ వెడ్జ్ కంపెనీల అధికారులతో కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ క్రాంతి మాట్లాడు తూ మహిళలు టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండడం వల్ల మహిళలకు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సాధికారత కల్పించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ, ఉద్యాన సేవలు అందించడానికి డ్రోన్ లు అందించడం లక్యంగా పెట్టుకొని మహిళలకు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని అన్నారు.
డ్రోన్ శిక్షణను రాష్ట్ర స్థాయిలో మొదటి సారిగా సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించామన్నారు. ఈ శిక్షణను క్షేత్రస్థాయిలో అమలుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరిత గతిన మహిళలకు డ్రోన్ లను బ్యాంక్ నుంచి గానీ శ్రీనిధి ద్వారా రుణాలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జ్యోతి, అదనపు డిఆర్డిఓ జంగారెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు హేటిరో హెడ్ సుధాకర్, సింక్రో సర్వీస్ హెడ్ నరసింహ, ఎరోస్పేస్ హెడ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.