నేర నియంత్రణలో సాంకేతికత కీలకం
సీసీటీఎన్‌ఎస్ 2.0, ఈ సాక్ష్యం అమలు చేయాలి
సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల, జూన్ 9 (విజయక్రాంతి): నేర నియంత్రణలో సాంకేతికత కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళ వారం మంచిర్యాల , పెద్దపల్లి జిల్లాల పోలీసు అధికారుల మే నెల నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీసు సిబ్బంది పనితీరును సమీక్షించారు.
ఇప్పటివరకు నమోదైన కేసులు, పెండింగ్లో ఉన్న పాత కేసులు, దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో ఎలాంటి రాజీ పడకుండా పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నమోదయ్యే ప్రతి కేసును నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల్లో అవసరమైతే న్యాయ సలహా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు.
ఆస్థి సంబంధిత నేరాలు, ఆర్థిక నేరాల కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆస్తుల గుర్తింపు, స్వాధీనం, అటాచ్మెంట్ ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళలకు సంబంధిం చిన తీవ్రమైన కేసుల్లో నిందితుల అరెస్టులను ఆలస్యం చేయరాదని, గ్రేవ్ కేసులు, ఎన్డీపీఎస్ కేసులు తదితర కీలక కేసులను డీసీపీలు, ఏసీపీలు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పెండింగ్ నాన్-బెయిల బుల్ వారెంట్ల అమలుపై ప్రతిరోజూ పర్యవేక్షణ నిర్వహించాలని, చిన్నచిన్న నేరాలపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఎస్హెచ్‌ఓ,సీఐ స్థానిక ఇంటెలి జెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్ సిబ్బందితో మాట్లా డుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించి నేరాల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు, కేసుల నిర్వహణలో పారదర్శకత, వేగాన్ని పెంపొందించేందుకు సీసీటీఎన్‌ఎస్ 2.0 (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టమ్స్), ఈ-సాక్ష్య (ఈ - సాక్ష్య) వ్యవస్థలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
సీసీటీఎన్‌ఎస్ 2.0 ద్వారా నేరాలు, నేరస్థుల సమాచారాన్ని వేగవంతంగా నమోదు చేయడం, దర్యాప్తు ప్రక్రియను డిజిటలైజ్ చేయడం, ప్రజలకు అందించే సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ-సాక్ష్య వ్యవస్థ ద్వారా నేర సంఘటనలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరించడం, భద్రపరచడం, కోర్టు విచారణల్లో సమర్పించే విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
సీసీటీఎన్‌ఎస్, ఎస్సీఆర్బీ నివేదికలు, ఎన్టీఆర్ ఫోటో డేటాబేస్తో పాటు ఇతర డిజిటల్ రికార్డులను నిరంతరం నవీకరించాలని, ఎస్హెచ్‌ఓలు కేసులకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్ణీత సమయంలో సిస్టమ్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి రామ్రెడ్డి, అదనపు డీసీపీ (అడ్మిన్) కె శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.






