14-09-2024 12:38:13 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 1౩ (విజయక్రాంతి): టెట్ మార్కులను సవరించుకొనేందుకు డీఎస్సీ అభ్యర్థులకు ఇటీవల అధికారులు అవకాశం కల్పించగా, అందులో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కొంత మంది అభ్యర్థులు తమ టెట్ మార్కులను సవరించుకున్నప్పటికీ మళ్లీ ఇప్పుడు వెబ్‌సైట్‌లో పాత టెట్ మార్కులే చూపిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా పలు రకాల టెట్ పరీక్ష పాస్ తేదీలు తప్పుగా చూపిస్తున్నాయని, సీటెట్ పరీక్షల వివరాలు, అభ్యర్థుల మార్కులు తప్పుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఓ అభ్యర్థికి కొత్తగా రాసిన టెట్‌లో వచ్చిన 129 మార్కులను అప్‌లోడ్ చేయగా, మళ్లీ పాత టెట్‌లో ఉన్న 91 మార్కులు చూపిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సాంకేతిక సమస్యలతో వేలాది మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని, వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎడిట్ ఆప్షన్ గడువును పెంచాలని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.