సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలి
ఏ రంగానికి ఎంత విద్యుత్తు ఖర్చవుతోంది?
విద్యుత్ సంస్థల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): విద్యుత్తు ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి త్రిసభ్య కమిటీ వేయాలని, విద్యుత్తు ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యుత్తు ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను ఈ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్ళి అధ్యయనం చేసి పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని, ఈ నివేదిక ఆధారంగా జెన్‌కో సీఎండీ నిర్ణయం తీసుకుని విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశించారు.
బుధవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌పై సమీక్షించారు. విద్యుత్తు సంస్థల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేయాలా? లేక కొత్తది కొనుగోలు చేయాలా? అనే అంశాన్ని టెక్నికల్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. డిసెంబర్ 2023కు ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి నివేదించాలని ఈ సందర్భంగా అధికారులకు భట్టి ఆదేశించారు. నిర్ణయాలను అమలుచేసే సమయంలో సీఎండీలు తప్పనిసరిగా ఎనర్జీ సెక్రెటరీని సంప్రదించాలని సూచించారు.
పలు వివరాలపై ఆరా
జల విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే.. వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఇందులో ఎలాంటి అలసత్వం వహించవద్దని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం గురించి ఆరా తీశారు. ఈ పథకానికి అర్హులైన గతంలో దరఖాస్తు చేసుకోనివారికి తిరిగి అవకాశం కల్పించి గృహజ్యోతి పథకాన్ని వారికి వర్తింపజే యాలని అధికారులను ఆదేశించారు.
ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 227 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రక్రియ మొదలైంద ని, అందులో 113 సబ్ స్టేషన్లకు స్థల సమస్యలు లేవని, మిగతా వాటికి స్థలాలను కలెక్టర్లు కేటాయించాల్సి ఉంద న్నారు. కాళేశ్వరం, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని మెగావాట్ల విద్యుత్తును ఉపయోగిస్తున్నారు? అందుకు ఎంతమేర ఖర్చవుతోంది? పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, డిస్కంల సీఎండీలు ముషారఫ్ అలీ, వరుణ్‌రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.