ఆస్తుల విక్రయంతో కలిసొచ్చిన క్యూ2
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఐటీ సర్వీసుల కంపెనీ టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2 రెండు రెట్లకుపైగా పెరిగి రూ. 1,250 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో రూ.433.9 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీకి చెందిన భూముల్ని, భవనాలను విక్రయించడంతో భారీగా నికరలాభాన్ని పెంచుకున్నది.
రెండో త్రైమాసికంలో తమ ఆదాయం రూ.12,864 కోట్ల నుంచి రూ. 13,313 కోట్లకు పెరిగినట్లు శనివారం టెక్ మహీంద్రా ఎక్సేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. భూముల్ని, ఫర్నీచర్, ఫిక్చర్స్‌తో సహా భవనాలను రూ.535 కోట్లకు విక్రయించడం ద్వారా వచ్చిన లాభంతో సహా రూ. 450 కోట్ల ఇతర ఆదాయం సమకూరినట్లు కంపెనీ వెల్లడించింది.
స్థిరాస్తుల విక్రయం ద్వారా రావాల్సిన మొత్తం 8.2 శాతం వార్షిక వడ్డీతో నాలుగేండ్లలో వస్తుందని పేర్కొంది. ఇక కంపెనీ పనితీరుకు సంబంధించి నికరలాభం స్వీక్వెన్షియల్‌గా 46.81 శాతం వృద్ధిచెందగా, ఆదాయం 2.36 శాతం చొప్పున పెరిగింది. షేరుకు రూ. 15 చొప్పున మధ్యంతర డివిడెండును టెక్ మహీంద్రా బోర్డు సిఫార్సుచేసింది. ఈ డివిడెండు చెల్లింపునకు నవంబర్ 1 రికార్డుతేదీగా నిర్ణయించింది.
పెరిగిన ఉద్యోగుల సంఖ్య
తాజాగా ముగిసిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా కొత్తగా 6,653 మంది ఉద్యోగు ల్ని జతచేసుకుంది. దీనితో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,54,273కు పెరిగింది.