11-04-2025 11:32:08 PM
కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు అగస్టీన్ ఎస్కోబార్
హడ్సన్ నది మీదుగా ప్రయాణిస్తూ కుప్పకూలిన చాపర్..
న్యూయార్క్: అమెరికాలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సీమెన్స్ కంపెనీ సీఈవో అగస్టీన్ ఎస్కోబార్ సహా కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. న్యూయార్క్ పర్యటనకు వచ్చిన అగస్టీన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ మీదుగా వెళ్తూ ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ నదిలో కుప్పకూలింది. అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఎస్కోబార్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు సహా పైలెట్ కూడా ఉన్నారు.
సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు బోట్ల సాయంతో సహాయక చర్యలు ప్రారంభించాయి. హెలికాప్టర్ తలకిందులుగా నీళ్లలో కూరుకుపోయినట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ గాల్లో ఉండగానే దాని సగ భాగం విరిగినట్టు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ బెల్ 206 చాపర్‌ను న్యూయార్క్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తోంది. రవాణా కార్యదర్శి సీన్ డఫీ, అతని బృందం ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఎవరీ అగస్టీన్ ఎస్కోబార్?
అగస్టీన్ ఎస్కోబార్‌కు ఇంధన, రవాణా రంగాల్లో 25 సంవత్సరాలకు పైగా అనుభవముంది. 2022 డిసెంబర్ నుంచి సీమెన్స్ స్పెయిన్ కంపెనీకి ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తూనే సీమెన్స్ మొబిలిటీ సౌత్‌ఈస్ట్ యూరోప్‌కు సీఈవోగానూ వ్యవహరిస్తున్నారు. అంతకముందు 2014 నుంచి 2018 వరకు లాటిన్ అమెరికాలో సీమెన్స్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ డివిజన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిటీస్ సెక్టార్‌లో సీఈవోగా పనిచేశారు. 1998 నుంచి 2010 వరకు సీమెన్స్ స్పెయిన్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.