24-03-2025 01:02:11 AM
తిమ్మాపూర్, మార్చి 23: తెలంగాణలోని ఏ మూలకు వెళ్లి ఏ రైతును పలకరించినా వారి కండ్లల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయని, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అన్నీ వర్గాలను ఇబ్బందులు పెడుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరో పించారు.
కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం బాగు ండేదని సబ్బండవర్గాలు అభిప్రాయపడుతున్నాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రం లోని కాంగ్రెస్ విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వీ కన్వెన్షన్ హాల్‌లో పార్టీ ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ, కేంద్రంలోని బీజేపీ హయాం లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వం రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను నిండా ముంచిందని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో ఉన్న స్థిరత్వం ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో లేక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ పెట్టే బాధలు చూసి ఇప్పుడందరికీ కేసీఆర్ గుర్తుకొస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధుకు మంగళం పాడుతారని కేసీఆర్ అప్పుడే హెచ్చరించారని, అయినా ప్రజలు వినిపించుకోలేదని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పిన కాంగ్రెసోళ్ల మాటలు నమ్మారని, ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ రాజ్యమనే విషయా న్ని మరిచిపోయా రని వ్యాఖ్యానించారు. రైతుబంధు, రాయితీలు, ఉచిత విద్యుత్తు, రైతు బీమా లాంటి పథకాలతో రైతులను కేసీఆర్ రాజులను చేస్తే.. కాంగ్రెస్ జమానాలో వారి బతుకులు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులూ ఇదే స్థితిలో ఉన్నారని, 70 శాతం వేతనాలు పెంచి, స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇచ్చిన కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రం లో ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చిన పీఆర్సీయే అమలవుతోందని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్యోగులకు ‘జీతం ఎప్పుడు ఇవ్వగలమో తెలియదు’ అని వ్యాఖ్యానించడం
కాంగ్రెస్ పార్టీ దివాలాతనానికి అద్దంపడుతుందన్నారు. 2023లో హైదరాబాద్‌లో సభ పెట్టి ఏడాది లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాగ్దానం చేశారని, 14 నెలలు గడిచినా ఒక్క ఉద్యోగం ఇవ్వ లేకపోయారన్నారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు.
పార్టీ రజతోత్సవాలతో చరిత్రను వివరించాలి
బీఆర్‌ఎస్ రజతోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని, గ్రామాగ్రామాన, ప్రతి జిల్లాలో ఉద్యమ చరిత్రను తెలియజేసేలా ఫొటో ఎగ్జిబిషన్లు, డాక్యూమెంటేషన్లు, శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. బండి వెనుక బండిగటిట్టి.. పదహారు బండ్లుగట్టి’ అన్నట్టుగా.. ప్రతీ కార్యకర్త తన పరిధిలో ఈ తరం పిల్లలకు పార్టీ చరిత్ర ను గుర్తు చేయాలని పిలుపునిచ్చారు.
రజతోత్సవాల తర్వాత పార్టీ శ్రేణులంతా ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై సిద్ధం కావాలని కోరారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదే బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు తమను అణిచివేస్తున్న వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సప్త సముద్రాలు దాటినా, తీసుకొచ్చి మరీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్నారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, బీఆర్‌ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.