calender_icon.png 11 January, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఇరివెంటి’ కంట కన్నీరు!

14-09-2024 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

అది ఎంఏ తెలుగు లాస్ట్ బ్యాచ్. నిజాం కళాశాలలో సాయంత్రం చదవడానికి అవకాశం దొరకడం వల్ల ఉద్యోగస్తులకు ఎంతో లాభదాయకమైంది. కె.గోపాల కృష్ణారావు మాకు శాఖాధ్యక్షులు. ఇరివెంటి కృష్ణమూర్తి, ముదిగొండ శివప్రసాద్, పాకాల యశోదారెడ్డి, వేటూరి ఆనందమూర్తి మా ఆచార్యులు. ఆయా సాహిత్య ప్రక్రియలలో గొప్ప పరిశోధనలు చేసిన సాహితీమూర్తులు వీరు. ఎంఏ మొదటి సంవత్సరంలో ఉండగానే మా శాఖాధ్యక్షుల ఆధ్వర్యంలో, ఇతర ఆచార్యులతో కలిసి టూరుకు వెళ్లాం. నాగార్జునకొండ, శ్రీశైలం ప్రాజెక్టులు చూసి ఒకరోజులో తిరిగి రావడానికి ప్లాన్ చేశాం. ఆచార్యులతో కలిసి మాకు సరిపోయే టూరిస్టు బస్సులో బయల్దేరాం.

మా వెంట గోపాల కృష్ణారావు, ఇరివెంటి, ముదిగొండ శివప్రసాద్‌లు ఉన్నారు. వారు నన్ను ‘ఏదైనా ఒక కథ చెప్పమని’ అన్నారు.. ‘ఇరివెంటి వారు కోరినారు కదా’ అని నేను మధురాంతకం వారి ‘తాను వెలిగించిన దీపం’ అనే కథను వినిపించాను. అట్లా విన్నారో లేదో, ఇరివెంటి వారి కళ్లనుండి ధారాపాతంగా కన్నీళ్లు రావడం చూశాను. అశ్రుపూరితమైన నయనాలతో కనిపిస్తున్న ఇరివెంటిని ‘నేనేమైనా బాధ పెట్టానేమో’ అని నా మిత్రులు సందేహించారు.   అప్పుడు నేను ఇరివెంటి వారికి చెప్పిన కథను మళ్లీ అందరికీ వివరించాను.

తాను వెలిగించిన దీపం

అతడొక ఉపాధ్యాయుడు. తాను ముప్పయి సంవత్సరాలకు పైగా పనిచేసిన పాఠశాలకు ఒకనాడు వచ్చాడు. ఎదిగిన తన కూతురికి పెళ్లి చేయలేని స్థితిలో తాను పని చేసిన పాఠశాల సహోపాధ్యాయులు ఎవరైనా తోడ్పడుతారనే ఆశతో. ఇరవై మైళ్లు ప్రయాణం చేసి రైలులో వచ్చాడు. కానీ, పాఠశాలలో అతణ్ణి పట్టించుకున్న వారు లేరు. ఒకరిద్దరు గుర్తు పట్టినా, అతని అభ్యర్థనను విని ఊరుకున్నారే గాని ఎలాంటి సహాయాన్ని ప్రకటించలేదు. 

ఆ పాఠశాలలో తనను గుర్తు పట్టేవాళ్లు, తన సేవలను గుర్తించే పాఠశాల పాలకవర్గం ఉందనుకొని వచ్చాడు ఆ ఉపాధ్యాయుడు. కానీ, ఎలాంటి ప్రయోజనం కలగక పోవడంతో రిక్తహస్తాలతో తిరుగు ప్రయాణం అయ్యాడు. ఏదో పోగొట్టుకున్నట్లు బాధకు లోనయ్యాడు. ఎవరెలాంటి సహాయం చేయక పోవడం వల్ల ఆ మధ్యాహ్నం సరిగా భోజనం కూడా చేయలేదు. ఎట్లాగో రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. 

అతడు వచ్చినంతలోనే రైలు వచ్చింది. టికెట్టు తీసుకోవడానికి కూడా టైం లేకుండా పోయింది. ఏమనుకున్నాడో ఏమో తొందరలో రైలు ఎక్కాడు. అప్పటికే చీకటి పడింది. రైలు ఆగుకుంటూే ఆగుకుంటూ బయల్దేరింది, ఆయా స్టేషన్లలో.

ఆ ఉపాధ్యాయుడు జనరల్ కంపార్టుమెంటులో ఒకచోట కూర్చున్నాడు. ఆ తొందరలో టికెట్టు తీసుకోని విషయమే మరిచిపోయాడు. ఇంటి దగ్గర తన కోసం భార్యాపిల్లలు ఎదురు చూస్తుంటారు. తొందరగా వెళితే బాగుండునని అనిపించింది. నిజానికి తాను ఇంటినుంచి వెళ్లేటప్పుడు  “ఎందుకు పోతారండీ? ఎవరు గుర్తు పడుతారు మిమ్మల్ని? నాకు అనుమానంగానే ఉంది..” అని భార్య చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి, ‘రాకపోతే బాగుండు’ అనుకున్నాడు.

పక్క స్టేషన్‌లో రైలు ఆగింది. ఒక గంటకుపైగా అయ్యింది. అప్పటికి సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటింది. ఆ ఉపాధ్యాయుని మనస్సులో ఆందోళన మొదలైంది. ఎప్పుడు రైలు దిగి, ఎప్పుడు తను ఇంటికి చేరాలో తెలియని పరిస్థితి అది. రైలు దిగిన తర్వాత కూడా రెండు మైళ్లు నడిస్తే గాని తన ఊరు రాదు, తన ఇంటికి చేరుకోడు. ఎన్నో ఆలోచనలు అతణ్ణి ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా టీసీ వచ్చాడు. అతడు వచ్చినంతలో రైలులో లైటు పోయింది. ఎవరిని ఎవరూ గుర్తించే పరిస్థితిలో లేరు. టీసీ టిక్కెట్టు అడిగాడు తనని. తొందరలో తీసుకోలేదని సమాధానం ఇచ్చాడు ఉపాధ్యాయుడు. టిక్కెట్టు తీసుకోలేదన్న ఉపాధ్యాయుణ్ణి టీసీ ఏమీ అనలేదు. “రండి” అని చెప్పి ఆ చీకట్లోనే స్టేషన్‌లో ఉన్న గదిలోకి తీసుకొని వచ్చాడు. గదిలో లైట్ వేశాడు. ఆ లైటు వెలుగులో టీసీ ఆ ఉపాధ్యాయుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. అతడు తన చిన్ననాటి గురువు. అతని దగ్గర 5వ తరగతి వరకు చదువుకున్నాడు. తనను గుర్తు పట్టి, గౌరవంగా తన పాదాలను స్పృశించిన టీసీని ఆ ఉపాధ్యాయుడు ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు.

‘టీసీ టిక్కెట్టు లేనందుకు ఏం శిక్ష వేస్తాడో’ అనుకున్న ఉపాధ్యాయునికి అనుకోని గౌరవం లభించింది. ఆ రాత్రి భోజనం ఏర్పాటు చేసి, ఉదయం కొంత డబ్బిచ్చి టీసీ ఆ ఉపాధ్యాయుణ్ణి సగౌరవంగా ఇంటికి పంపే ఏర్పాటు చేశాడు. ‘తాను వెలిగించిన దీపం ఇంత ప్రకాశాన్ని ఇస్తుందా!?’  అని ఉపాధ్యాయుడు ఎంతో సంతోషించాడు. 

ఈ కథను విన్న ఇరివెంటి వారు పులకించి పోయి, దుఃఖాశ్రువులను కార్చడం వారి సున్నిత హృదయాన్ని తెలియజేస్తుంది. కథ విన్న మా మిత్రులందరికీ నోట మాట రాలేదు. ప్రతి ఒక్కరి కళ్లలో అదే తడి. అదే బోధనా వృత్తిలో కొనసాగిన నేను ఈ కథను, ఆనాటి ఆ ఆర్ద్ర సన్నివేశాన్ని ఎలా మరిచిపోగలను!

వ్యాసకర్త సెల్: 9885654381