calender_icon.png 29 September, 2024 | 4:53 AM

మూసీలో పారేది కన్నీరే

29-09-2024 02:55:28 AM

  1. పేదలకో న్యాయం, సీఎం కుటుంబీకులకో న్యాయం 
  2. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది

బాధితులకు న్యాయం జరిగేదాకా ప్రభుత్వంపై ఉద్యమిస్తాం: మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబిత

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానని చెప్తూ.. పేద, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించేందుకు ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

తెలంగాణ భవన్‌కు శనివారం పెద్ద సంఖ్యలో హైడ్రా బాధితులు తరలిరావడంతో హరీశ్‌రావు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా నేడు హైడ్రోజన్ బాంబులా మారిందని, రాష్ట్ర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుందని విమర్శించారు.

తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి బుల్డోజర్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదని, తెలంగాణాలో బుల్డోజర్ రాజుకు ముక్కుతాడు వేయాలని సూచించారు.

24 గంటలు బీఆర్‌ఎస్ న్యాయవాదుల బృందం బాధి తుల సహాయం కోసం తెలంగాణ భవన్‌లో సిద్ధంగా ఉందని చెప్పారు. తమ పార్టీ నేతలంతా బాధితులకు రక్షణ కవచంగా నిలబడతామని హామీ ఇచ్చారు. బాధితులు ఫోన్ చేస్తే అండగా నిలబడతామని ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.

ప్రభుత్వ అరాచకాలు ఎండగడుతాం  

హైడ్రా బాధితుల మాటలు వింటుంటే తనకు బాధగా ఉందని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా బాధిత ప్రాంతాలకు వస్తారని, వారికి తామంతా అండగా ఉంటామని బాధితులకు హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. రేవంత్‌రెడ్డి సోదరునికి నోటీసులిచ్చి 45 రోజులు సమయం ఇచ్చారని, పేదోడికైతే రాత్రికిరాత్రే వచ్చి బుల్డోజర్లతో కూలగొడుతున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ హయాంలోనే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, కష్టం చేసి స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని, మున్సిపాలిటీల్లో అనుమతి తీసుకున్నారని తెలిపారు. బ్యాంకు రుణాలు తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఏటా పన్నులు సైతం కట్టారని.. ఏవిధంగా అవి అక్రమ నిర్మాణాలు అవుతాయో కాంగ్రెస్ పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

1993లో కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని, ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వమే వాటిని కూలుస్తుందని ఆరోపించారు. సీఎం రేవంత్.. నువ్వు చేస్తున్న గొప్ప పని సుందరీకరణ మాత్రమేనన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలకు ఎంతో ఉపయోగం జరిగిందని చెప్పారు. హైడ్రాతో పేదల కన్నీళ్లు చూస్తే బాధితుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్లు దీవెనలు ఇస్తారని, వారి ఉసురు తీస్తే శాపనార్తాలు పెడతారనే విషయం రేవంత్ మర్చిపోవద్దన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని, తర్వాతే మూసీ వద్ద ముందుకు వెళ్లితే బాగుడేందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా హైడ్రా పేరుతో నాటకాలు ఆడటం మానుకోవాలని హితవు పలికారు.

గోడు వెల్లబోసుకున్న బాధితులు

పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి తమకు లేదని, గుండె ఆగిపోతుందని బాధితులు కంటతడిపెట్టారు. కంటిమీద కునుకు ఉండట్లేదని, బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని.. మీరే న్యాయం చేయాలని హైడ్రా బాధితులు బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఎదుట గోడు వెల్లబోసుకున్నారు.

ఎప్పుడేమీ జరుగుతుందనే ఆందోళనతో గొంతులో ముద్ద దిగట్లేదనివ వాపోయారు. స్థలాలు కొనుగోలు చేసినప్పుడు ఇలాంటి సమస్యలు ఉంటాయని తమకు తెలియదని, లక్షల్లో బ్యాంకు లోన్లు తెచ్చి, ఇల్లు కట్టుకున్నామన్నారు. ఇప్పుడు కూల్చేస్తే తమ పిల్లలు రోడ్డున పడతారని, తెల్లారితే అసలు ఏం జరుగుతుందోనని భయంగా బతుకుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.  

మీ ఇల్లు చెరువులోనే ఉందిగా రేవంత్.. 

పేదల ఇండ్లు కూలుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పేదల ఇల్లు ఎఫ్టీఎల్‌లో, బఫర్ జోన్‌లో ఉన్నాయని వేధిస్తున్న రేవంత్‌రెడ్డి.. కొడంగల్‌లోని తన ఇల్లు ఎక్కడ ఉందో చూసుకోవాలని హితవుపలికారు. కొడంగల్‌లో కుంటలో కట్టిన మీ ఇంటిని తొలగించిన తర్వాత ఇక్కడ చర్యలు తీసుకోవాలని సూచించారు. 

తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు 

హైడ్రా బాధితులకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్ నేతలు భరోసా ఇవ్వడంతో, బాధితులు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ కార్యాలయం పరిసరాలు మధ్యాహ్నం వరకు జనంతో కిటకిటలాడాయి. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. వారిని సమావేశ మందిరంలోకి తీసుకెళ్లి ఒక్కొక్కరితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 

బుచ్చమ్మది రేవంత్ సర్కార్ హత్య

  1. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు  
  2. ఇంకా ఎంత మందిని చంపుతారు
  3. గాంధీ ఆస్పత్రి వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ముమ్మాటికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యే అని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు శనివారం మాజీ మం త్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీశ్‌రావు వెళ్లారు.

బీఆర్‌ఎస్ నేతలు వస్తు న్నారన్న సమాచారంతో పోలీసులు భారీ గా మోహరించారు. ఆస్పత్రి గేటు వద్దకు రాగానే వారిని అడ్డుకున్నారు. పోలీసులతో చర్చించిన అనంతరం హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, సహా కొంతమంది ముఖ్య నాయకులను హాస్పిటల్‌లోకి అనుమతించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లా డుతూ.. హైడ్రా అధికారుల వేధింపులు భరించలేకనే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయ ని, ఇంకా ఎంత మందిని చంపదలుచుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కూల్చివేతలు కాదు.. నిలబెట్టడం నేర్చుకో సీఎంకు సూచించారు.

హైడ్రాపైకేసు నమో దు చేయాలన్నారు. కమిషనర్ రంగనాథ్ పేదల ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చేస్తురన్నారని విరుచుకుపడ్డారు. పేదలు కోర్టుకెళ్లరనే ధైర్యంతోనే చేస్తున్నారని విమర్శించారు. 30 ఏండ్లుగా నివాసముంటున్న వారి ఇండ్లను కూల్చే అధికారం సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పిచ్చి పనులు మానుకొని వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల నిర్ణయం మేరకు ముందుకెళ్లాలని సూచించారు.