calender_icon.png 18 January, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క‘న్నీటి’ చెలిమె..!

07-10-2024 12:00:00 AM

బతుకమ్మ అంటే..

బతుకును నేర్పిన ఉద్యమం

దొరల పెత్తనాన్ని

దునిమాడిన జానపదం

నీళ్లు లేని తెలంగాణలో

క‘న్నీటి’ చెలిమె బతుకమ్మ

కాయ కష్టంలో

ఆత్మీయ చెలిమి బతుకమ్మ

పని పాటల జమిలి

బతుకు పాటల బలిమి

చైతన్యపు కలిమి బతుకమ్మ

బతుకమ్మ అంటే..

తనను తాను తవ్వి పోసుకున్న పాట

తనకు తానై 

ఉవ్విళ్ళూరిన పాట

తనువెల్ల పల్లవించిన పాట

ఒక తలపోత.. ఒక వల పోత

విజయగాథల పూల పోత

పరిపరి విధాల పరివ్యాప్తమైన 

పల్లె పాట పడతుల ఆట

బతుకు పోరును పరిచిన 

సామూహిక జీవన బాట

చిమ్మని చీకట్లలో

పూల వెలుగు బతుకమ్మ

కమ్మని ఆటళ్లలో 

స్వేచ్ఛా పులుగు బతుకమ్మ

చైతన్యపు చప్పట్లలో

సంప్రదాయ తెలుగు బతుకమ్మ

ప్రకృతి పులకింతలతో

పురివిప్పుకునే

విజయగాథల ఆస్తి

సంస్కృతికి తొలి కిస్తీ

ఆడ పడుచుల దోస్తీ

ఉద్యమాల ఊపిరి

ఊయల పాటల ఝరి బతుకమ్మ

కోలాటాల సవ్వడిలో

సమైక్య సాధనా గీతిక

సమిష్టి భావనా పతాక

తెలంగాణ అస్తిత్వ ప్రతీక

ప్రకృతి ఒడిలో పూదోట

వేల పాటల ఊట

ఆడ పడుచుల సయ్యాట

కోటి గొంతుల బావుట బతుకమ్మ..!

 డా. కటుకోఝ్వల రమేష్

9949083327