-అల్లం రాజయ్య
అడువులు పురిటి నొప్పులు పడ్తున్నాయి. దేశాలు విముక్తిని కోరుతున్నాయి. జాతులు స్వేచ్ఛ కోరుతున్నాయి.. వ్యక్తులు సమిష్టి కోసం పోరాడ్తున్నారు. సూర్యుడు నిరంతరం జ్వలిస్తూనే ఉన్నాడు.
అతను కూర్చున్నాడు.. కూర్చుండి సిగరెట్లు కాలుస్తున్నాడు. అతని గదినిండా పీకలు తెగిన సిగరెట్లు- సిగరెట్లు కాలిన బూడిద శ్మశానంలా గది గదిలాగా అంతరంగం. అతని వయసు ముప్పయి దాటుండవచ్చు. మూతిమీద మీసం కట్టు-. కళ్లల్లో చురుకుదనం. అతను యుద్ధరంగం నుండి పారొచ్చిన ఖైదీలా ఉన్నాడు. ఉద్యమం నుండి ఉరుకొచ్చిన విప్లవకారుని లాగా ఉన్నాడు. అతని మన సు ఎలుగడి బడుతున్న అరణ్యం లాగా ఉంది. అతని జుట్టు వెంట్రుకలు ఎక్కు పెట్టిన బాణం వుల్లల్లాగా ఉన్నాయి. అతను జుట్టు పీక్కోవడం లేదు. అంగి చింపేసుకోవడం లేదు. కాని, సిగరెట్లు కాలుస్తున్నాడు. ఆలోచిస్తున్నాడు.
ఇవ్వాళ్ల మళ్లీ సాయంత్రమయ్యింది. నిన్నటి సాయంత్రం లాగే ఇవ్వాళ్టి సాయం త్రం మళ్లీ గడిచి పోతోంది. నిన్న లేని ప్రత్యేకత ఇవ్వాళ్టికి లేదు. నిన్న జరిగిన సంఘట నల్లాగానే నేటి సాయంత్రం వెళ్ళిపోతోంది.
అయిపోయింది.. ‘ఐ’ పోయింది. నా కండ్లు మూసుకు పోతున్నాయి. ఖవద్దా రు...‘ఐ’ మీను నేను చచ్చి పోతున్నాను. అయిపోయింది.
“అయ్యో సాయంత్రం కూడా వెళ్లిపోయింది” అనుకున్నాడు గదిలో నిలబడి కిటికీ గుండా చిక్కబడుతున్న చీకటిని చూస్తూ.. వేగంగా పచారు చేస్తూ.
-మళ్లీ పొద్దు క్రుంకుతోంది. సూర్యాస్తమయం.. కిటికీ నుండి దూరంగా కనిపించే కొండలవేవు చూసిండు--. కొండలమీద ఆకాశం ఒంటినిండా రక్తమయం- ఎవరో ఆకాశాన్ని హత్య చేసి వెళ్లిపోయినట్లున్నది.
“తర్వాత చీకటి...” అనుకుంటూ పచా రు చేశాడు. గది నిండా చీకటి... కాళ్ల క్రింద సిగరెటు పీకల రోదన... అగ్గిపెట్టె కాబోలు చితికి పోయింది. తుర్క్‌మన్ గేటు దగ్గర బుల్డోజరు క్రింద వలిగిపోయిన గుడిసెల్లా.
“టైమెంతయ్యిందో? కాలాన్ని పట్టి ఆపు తే..” అతనికి టైము తెలియలేదు. అతను కాలాన్ని ఆపలేదు. అందుకు సాక్ష్యంగా అతని గది బయటి ప్రకృతి వెన్నెల మేస్తోంది. అతను ఆశ్చర్యంగా బయటికి చూశాడు.
“వెన్నెల పట్ట పగలల్లా నిన్నటికన్నా మెరుగ్గా....
మళ్లీ రాత్రి నిన్నటిలా నిద్ర పోతాను. కలల్ను తింటాను. నన్ను నేను దగా చేసుకుంటాను.”
బయట రైలు మొత్తుకున్నది.. అతను ఉలిక్కి పడ్డాడు.
‘రైలు వెళ్లిపోయింది.. పట్టాల్లాగా మసగ్గా మిగిలి పోయిన దారి. టిక్కెట్టు లేకుండా, ప్రమాదాలు లేకుండా (టీటీ ల్లేకుండా) ప్రయాణించాలనుకున్నా కాని రైలెల్లి పోయింది.. మళ్లీ బాధ మిగిలి పోయింది.’
‘మళ్లీ సాయంత్రాలు బాధ పెడ్తాయి. నేను అన్నీ కోల్పోయాను. సాయంత్రాల్ని నమ్ముకొని పగల్లను పోగొట్టుకున్నాను. నేను ఆలోచిస్తూనే అన్నీ కోల్పోతున్నాను. నన్ను నేను ప్రమాదాల కంకితం చేసుకునే ధైర్యాన్ని, నన్ను నేను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని, నన్ను నేను త్యాగం చేసుకునే కర్తవ్యాన్ని మెల్లగా మెల్లెమెల్లెగా కోల్పోతున్నాను.’
‘చివరకు చరిత్ర తీర్పు చెప్పుతుంది.. ప్రజలు నన్ను పిరికిపందగా గుర్తిస్తారు. చేవ లేని చావుకు భయపడే గుడ్డి గడ్డి వెధవను. గుడ్డిగవ్వను. పురుగులా నా ముఖా న్ని గాజు కిటికీ తలుపు కేసి కొట్టుకు కుళ్లి పోవాలనే తలంపు గలవాణ్ణి.. ఛీ.. ఛీ. నేను చాలా పిరికివాణ్ణి..’
అతను పిరికి ముఖం పెట్టాడు. అసహ్యంగా, అసహనంగా, అలజడిగా ఆ గదిలో పచారు చేశాడు..
నేను మళ్లీ అవకాశాల గురించి, జీవితా ల గురించి, సుఖాల గురించి, చొప్పదంటు బ్రతుకు గురించి ఆలోచిస్తున్నాను.. పంథా ల గురించి మళ్లీ మళ్లీ తిరగదోడ్తున్నాను.. నా బొంద నేనే ఎన్నిసార్లు తోడి చూసుకోగలను..? మళ్లీ మింగుతున్నాను పిరికి విషాన్ని? అదిగో మళ్లీ కలలు కంటు న్నా! పెదిమలు -ఎంగిలి నిండి, పూసి, రసికారే పెదిమలు.. వక్షోజాలు.. చీరెలు.. రంగురంగుల కంపు చెమట వాసన చీరె లు.. తడి.. గుండెదడ. పందుల్లా కుక్కల్లా, దొర్లడం.. బ్రతకడమంటే సెక్సడం కాదు.. బ్రతకడమంటే పోరాటం.. పోరాటమంటే పిరికివాని చేతి ఆయుధం కాదు.. వీరుని చేతిలోని తుపాకి..
అతను పిడికిలి బిగించి అరచేతిలో గుద్దుకున్నాడు.. గుడ్లు తేలేసిన చంద్రుడు కిటికీ గుండా భయభయంగా ఆ గదిలోనికి తొంగి చూస్తున్నాడు. వానికి అతను కనిపించలేదు. అతనికి వాడి వెలుగులో గోడ కు ఫొటో కనిపించింది. వెనక్కు చేతులు కట్టుకొని కాసేపు మౌనంగా చూసిండు..
ఫొటోలో ఆమె గుంగురు వెంట్రుకల అమాయకమైన ఆడది. ఆమె ఒంటి చుట్టు నల్లరంగు వస్త్రాలు.. నుదుట బొట్టు.. పెదిమిల మీద దగాకోరు జీవితాన్ని నమ్ము కున్న ధీమా! ఆమె చేతుల్లో నోరు తెరిచి నవ్వడం తప్ప మరేది తెలియని అమాయకపు పిలగాడు..
ఆమె వెనక అట్టమీద మేడ మెట్లు... అతను ఫొటోను గోడవేపు త్రిప్పిండు.
మళ్లీ బురదలోనికి పోతున్నాను.. ఒంటి నిండ బురద పూసుకొని ఇదే జీవితమని సంబర పడ్తాను. నిరాశలాంటి మత్తు మందుతో వాస్తవానికి చేతనైనంత దూరం గా పరుగెడుతున్నాను. నన్ను నేను హత్య చేసుకుంటున్నాను. నిజంగా నేను ఫెడౌట్ అవుతున్నా..
నిద్రలేమి కళ్ల బరువు. నేను సంతృప్తి పడలేని, రాజీలేని పోరాటం జీవితం.. కాని పంథా పండ్లు రాలగొడ్తోంది. నిజంగా నాకు తెల్సింది చాలా తక్కువ. కాని ఆలోచించాలి.. చించాలి.. చించి.. చించి చించి మళ్లీ కొత్తగా ఉత్సాహంగా ధైర్యంగా వీరునిలా పురుగులా కాకుండా చావో రేవో తేల్చుకోవాలి... అవును ఆలోచించాలి.. ఆలోచించుకుంటూండగానే మళ్లీ సాయంత్రాలు వెళ్లిపోతాయి.. అడువులు పురిటి నొప్పులు పడ్తున్నాయి. దేశాలు విముక్తిని కోరుతున్నాయి. జాతులు స్వేచ్ఛ కోరుతున్నాయి.. వ్యక్తులు సమిష్టి కోసం పోరా డ్తున్నారు. సూర్యుడు నిరంతరం జ్వలిస్తూనే ఉన్నాడు.
అతను ఏదో నిర్ణయించుకున్న వాడిలా అంగి లాగు ధరించాడు.. చేసంచి పట్టుకున్నాడు. తలుపు చప్పట్లు గొట్టింది. గొళ్ళెం సెహబాషంది. తాళం ‘చెలో’ అంది.. అతని చెప్పులు దారిని చరిచాయి కోపంగా..
సుశీల నాలుగో నాడు తండ్రితో తన తనయునితో ఆ గది ముందు దిగింది. డూప్లికేటు తాళం తెరిచింది.. గది ఎప్పుడో చచ్చిన గజ్జి కుక్కలాగా ఉంది. గదిలోని టేబిల్ మీద కాగితం వగరుస్తున్న పులి నాలికలా ఎగురుతోంది. దానిమీద తాబేలులా పేవరు వేట్..
“సుశీలా.. నా ఫొటోల కోసం కూడా వెతుకకు.. నీ జీవితాన్ని నీ ఆలోచనల కనువుగా సాగించు.. మన ఉమ్మడి సంతానం సత్యంకు సత్యం గురించి తెలుపు... ఇక సెలవ్.. నీ శ్రీవాత్సవ.
సుశీల ఏమి చేయాలో తోచక కూలబడిపోయింది.
-(ప్రచురణ: 1990 జూన్ 24,
‘ఉదయం’ ఆదివారం అనుబంధం)
‘కథా నిలయం’ సౌజన్యంతో..