- ఆటగాళ్ల ప్రాక్టీస్ షురూ
- జట్టుతో కలిసిన రోహిత్, కోహ్లీ, బుమ్రా
- 19 నుంచి బంగ్లాతో తొలి టెస్టు
చెన్నై: శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ అనంతరం నెల రోజుల పాటు విరామం తీసుకు న్న టీమిండియా ఆటగాళ్లు తిరిగి ప్రాక్టీస్ షురూ చేశారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా భారత జట్టు గురువారం రాత్రి చెన్నైలో అడుగుపెట్టింది. శుక్రవారం ఉద యం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో పాటు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ సుదీర్ఘంగా చర్చించారు.
ద్రవిడ్ రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా బాధ్యతలు చేప ట్టిన గంభీర్‌కు ఇదే తొలి రెడ్‌బాల్ సిరీస్ కావడం గమనార్హం. ఇక దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీకి దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్, విరాట్, బుమ్రా జట్టుతో కలిశారు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రోహిత్ సేన సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా బంగ్లాతో తొలి టెస్టు ఆడనుంది.
ఆరు నెలల తర్వాత..
దాదాపు ఆరు నెలల తర్వాత టీమిండియా రెడ్‌బాల్ క్రికెట్ ఆడనుండడం గమనార్హం. చివరగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడిన భారత్ 4 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2023 సైకిల్‌లో భాగంగా పట్టికలో టీమిండియా (9 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు) తొలి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు) రెండో స్థానంలో కొనసాగుతోంది. గతంలో (2019 2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్) రెండు సందర్భాల్లో భారత్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
బంగ్లాతో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా వరుసగా న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్‌లో చాంపియన్‌గా నిలిచిన భారత్ ఈసారి డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. దీంతో బంగ్లాతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది.
లండన్ నుంచి నేరుగా..
బంగ్లాతో టెస్టు మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లు గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. లంకతో వన్డే సిరీస్ అనంతరం లండన్ వెళ్లిపోయిన కోహ్లీ నేరుగా అక్కడి నుంచే చెన్నైకి చేరుకొని జట్టుతో కలిశాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పేసర్ బుమ్రా ఎస్కార్ట్ సాయంతో ఎయిర్‌పోర్టు నుంచి టీమిండియా బస చేయనున్న హోటల్ రూంకు చేరుకున్నాడు. మిగతా జట్టు అంతా చెన్నైలోనే ఉన్న సంగతి తెలిసిందే.
బంగ్లాతో సిరీస్‌కు ఎంపికైన కేఎల్ రాహుల్, పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్, జైస్వాల్, గిల్.. దులీప్ ట్రోఫీలో తొలి రౌండ్ మ్యాచ్‌లను చెన్నైలోనే ఆడారు. ఈ నేపథ్యంలో వీళ్లంతా ఇక్కడే ఉండిపోయారు. టీమిండియా ప్రాక్టీస్ వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేసుకున్న బీసీసీఐ.. ‘కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. కోహ్లీ 45 నిమిషాల పాటు బ్యాటింగ్ చేయగా.. బుమ్రా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. స్వదేశంలో కొత్తగా ఆటను ప్రారంభించింది’ అని పేర్కొంది.