calender_icon.png 16 November, 2024 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈత నేర్పిస్తూ.. ప్రాణాలు కాపాడుతూ!

12-11-2024 12:00:00 AM

కేరళ అంటే ఆకాశాన్ని తాకే కొబ్బరి చెట్లు, పడవలు, పచ్చని పరిసరాలు మాత్రమే కాదు.. కళ్లముందు పారే నదులు, చెరువులెన్నో. సరదా కోసం పిల్లలు ఈత కొట్టేందుకు చెరువుల్లో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈతకొట్టడం రాక యువకులు, మహిళలు కూడా చనిపోతున్నారు. ఇవన్నీ జానకమ్మను కదిలించాయి. అందుకే స్విమ్మర్‌గా మారి ఎంతోమందికి ఈతను నేర్పిస్తోందీమె. 

‘పాడి రైతుగా పశువైద్యశాలకు, ఇతర పనుల కోసం నిత్యం విహారయాత్రలు చేయాల్సివచ్చేది. ఆ పర్యటనల్లో ఈత నేర్చుకునేందుకు ఎక్కువ మంది సహాయం కోరేవారు. ఓసారి నాలాంటివాళ్లతో కలిసి బీచ్‌కు వెళ్తే.. ఈత తెలియక ఒడ్డున ఒంటరిగా నిలుచున్నారు చాలామంది. అలాగే 2016 నుంచి 2021 వరకు కేరళలో దాదాపు 6,710 మంది మృత్యువాత పడ్డారు. ప్రతిరోజూ జరిగే బోటు ప్రమాదాల్లో చిన్నారులు మృతి చెందడం నన్ను కలిచివేసింది. అందుకే స్విమ్మింగ్ పాఠాలు నేర్పిస్తున్నా’ అని అన్నారు.

మొదట్లో ‘ఈత నేర్పిస్తా.. రండి’ అని జానకమ్మ అభ్యర్థిస్తే ఏ ఒక్కరూ ముందుకురాలేదు. దాంతో తన ఇంటి నుంచే ఈత ప్రయాణం మొదలుపెట్టింది. మనవడికి ఈత నేర్పిస్తే భయపడిపోయాడు. ఆ తర్వాత మెల్లగా ఈత కొట్టడం నేర్చుకున్నాడు. చూస్తుండగానే వారంరోజుల్లో ఈతపై పట్టు సాధించి చేప పిల్లలా చెరువు మొత్తం ఈదేశాడు. ఆ దృశ్యాలను చూసి మిగతా పిల్లలూ ముందుకొచ్చారు. ఇరుగుపొరుగు, తెలిసినవాళ్ల పిల్లలు జానక మ్మ చేతుల్లో పడుకుని ఈత నేర్చుకుంటున్నారు.

స్థానిక మహిళలు తమ పిల్లలతో సహా చెరువు వద్దకు వస్తారు. అలా జానకమ్మ ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు వెయ్యి మందికిపైగా ఈత నేర్పించింది. రోజూ వందలాది మంది చిన్నారులకు, మహిళలకు ఉచితంగా స్విమ్మింగ్ నేర్పిస్తూ వాటర్ ఫొబియోను పొగోడుతోంది. అయితే ‘ఫలానా వయసు తర్వాత ఈత నేర్చుకోలేరు’ అనే అపోహనూ జానకమ్మ బ్రేక్ చేసి నిరూపించింది. 65 ఏళ్ల వయసులోనూ తన గ్రామ ప్రజలను శక్తివంతంచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది.

అంతేకాదు.. చెరువుల రక్షణ కోసం కూడా నడుంబిగించింది. ప్లాస్టిక్ వ్యర్థాలు కలిసిపోకుండా, రసాయనాలతో నిండిపోకుండా గ్రామీణుల్లో అవగాహన కల్పిస్తోంది. 

జానకమ్మకు సొంత కుటుంబమే బలం. కుటుంబం నుంచి ఎవరూ ఆమెను నిరుత్సాహపర్చలేదు. భర్త పివి కృష్ణన్ తో పాటు కుమార్తె, అల్లుడు కూడా ప్రోత్సహించారు. ’ఈ వయసులో నీకు అవసరమా జానకమ్మ.. అంటూ స్థానికులు కూడా విమర్శించలేదు. ప్రస్తుతం కేరళలోని కన్నూర్ గ్రామంలోని ఆడవాళ్లందరికీ ఈత నేర్పిన మహిళగా జానకమ్మ పేరు వినిపిస్తోంది. అంతేకాదు.. ఆదర్శ మహిళగా, జంతు ప్రేమికురాలిగా, పర్యావరణవేత్తగా మెరుగైన సమాజం కోసం పాటుపడుతోంది. ‘నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకు ఈత నేర్పిస్తూనే ఉంటాను. ఈత లేని జీవితాన్ని ఊహించడం అసాధ్యం‘ అని అంటోందీమె. 

రోజుకు నాలుగు గంటలు..

కళ్ల ముందు ఎవరైనా మునిగిపోవడం చూస్తే ఏమాత్రం ఆలోచించకుండా చెరువైనా, నదైనా దూకేస్తుంటుంది జానకమ్మ. మునిగిపోతున్న మనిషిని ఆమె ఎప్పుడూ పట్టుకోదు. బదులుగా జుట్టు లేదా బట్టలను పట్టుకొని పైకి లాగేస్తుంటుంది. ఇలా ఎంతోమందిని కాపాడింది. జానకమ్మ ఎప్పుడూ ఇంటిపనులు, ఆవుల పెంపకం, ఈత నేర్పడం వంటి పనులతో బిజీగా ఉంటుంది. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు. ప్రస్తుతం 32 మంది పిల్లలు, 12 మంది మహిళలు ఈత నేర్చుకుంటున్నారు.

ఈత నేర్పించడం కోసం  రోజుకు (ఉదయం, సాయంత్రం) దాదాపు  నాలుగు గంటలపాటు చెరువులోనే ఉంటుంది. తడిస్తే జ్వరమొస్తుందేమోనని భయపడదు. 60 ఏళ్ల కాలంలో తనకు ఎప్పుడూ ఒక్క జలుబు కూడా రాలేదని, నిత్యం ఈత కొట్టడం వల్ల ఎలాంటి వ్యాధులు కూడా సోకలేదని గర్వంగా చెబుతోంది జానకమ్మ.