- 9 ఏళ్లకే ఇంగ్లండ్ జట్టులో చోటు
- చెస్‌లో రాణిస్తున్న చిచ్చరపిడుగు
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి బోధన శివానందన్ సంచలనం నమోదు చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న చెస్ ఒలింపియాడ్‌లో బోధన ఇంగ్లండ్ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. తద్వారా ఇంగ్లండ్ తరఫున ఏ ఆటలోనైనా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడనున్న అతి పిన్నవయస్కురాలిగా బోధన రికార్డుల్లోకెక్కనుంది. ఇంగ్లండ్‌లో స్థిరపడ్డ తమిళ కుంటుంబంలో జన్మించిన బోధన.. ఐదేళ్ల వయసులో కరోనా లాక్‌డౌన్ సమయంలో చెస్‌పై మక్కువ పెంచుకుంది. అనతికాలంలో బోధన ప్రతిభ గుర్తించిన తండ్రి.. ఆ దిశగా ప్రోత్సహించడంతో పాటు.. ప్రత్యేక శిక్షణ ఇప్పించడంతో మరింత రాటుదేలింది.
ఒకవైపు చదువు కొనసాగిస్తూనే.. చందరంగంపై పట్టుసాధించింది. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల వయసులో అత్యధిక ఎలో పాయింట్లు (2088) సాధించిన ప్లేయర్‌గా ఈ ఏడాది రికార్డుల్లోకెక్కింది. ఇప్పుడు తాజాగా హంగేరీ వేదికగా జరగనున్న చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొననున్న ఇంగ్లండ్ జట్టులో బోధన చోటు దక్కించుకుంది. బ్రిటన్ జట్టులో బోధన తర్వాత పిన్నవయస్కురాలు 23 ఏళ్ల లాన్ యో కాగా.. అంతర్జాతీయ స్థాయిలోనూ తన కూతురు సత్తాచాటగలదని బోధన తండ్రి విశ్వాసం వ్యక్తం చేశారు.