calender_icon.png 6 October, 2024 | 1:49 PM

ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి

06-10-2024 12:57:22 AM

రాష్ట్ర ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు ట్రస్మా కార్యవర్గం వినతి

ముషీరాబాద్, అక్టోబర్ 5 :   రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గల బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎన్ రెడ్డి, కే అనిల్ కుమార్, కోశాధికారి కే శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ట్రస్మా రాష్ట్ర నూతన కార్యవర్గం ఏర్పాటైన సందర్భంగా శనివారం స్టేట్  కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్ జీ రమేశ్‌ను  కలిసిన సభ్యులు.. బడ్జెట్ పాఠశాలల సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించి కార్పొరేట్ పాఠశాలలను నియంత్రించాలని కోరినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ను విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ముద్రించిన ప్రశ్నా పత్రాల ను పాఠశాలల్లో వాడటం లేదని, వాటిని వాడేలా.. అధికారులు, డీఈఓలు చర్యలు తీసుకోవాలని కోరినట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ట్రస్మా గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, అధికార ప్రతినిధి చింతల రాంచందర్, ముఖ్య సలహాదారు అనంతరెడ్డి, ఉపాధ్యక్షుడు పీవీ రాం నర్సయ్య, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు భానాల రాఘవ, జయరాం ప్రసాద్, వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.