17-04-2025 12:00:00 AM
కంటి తుడుపు కేసులతో సరిపెడుతున్న పోలీసులు
నాగర్‌కర్నూల్ ఏప్రిల్ 16 (విజయక్రాం తి): పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేర్పించారు. అక్కడ చదువు చెప్పాల్సిన టీచ ర్లే పలు రకాలుగా వేధించడంతో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు.
తాజాగా నాగర్‌కర్నూల్ మండలం నాగనూలు కస్తూ ర్బా గాంధీ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ విద్యార్థులను పరుష పదజాలంతో దూషిస్తూ చిన్నచిన్న కారణాలతో వేదిస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 6న యామిని అనే 9వ తరగతి విద్యార్థిని స్టడీ అవర్‌కు ఆలస్యంగా వచ్చిందన్న సాకు తో కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వకుండా, వాష్‌రూమ్‌కి కూడా వెళ్లనివ్వకుండా 3 గం టల పాటు నిల్చోబెట్టిన ఆ ఇంగ్లీష్ టీచర్ పైశాచిక ఆనందం పొందింది.
తీవ్ర మనస్థాపం చెందిన సదరు విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో పాటు సదరు టీచర్ కొంతమంది విద్యార్థులు స్నా నం చేస్తున్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి ఎవరికో పంపుతోందని విద్యా ర్థులు ఆరోపించారు. ఈ విషయంపై విద్యా ర్థి సంఘాలు ప్రజాసంఘాల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఉన్నత స్థాయి వర్గానికి చెందిన టీచర్ కావడంతో తెర వెనుక రాజకీయ నేతలు చక్రం తిప్పార నే విమర్శలు వినిపిస్తున్నాయి.
అందులో భాగంగానే విద్యాశాఖ అధికారులు కంటితుడుపుగా నివేదికలు పంపామంటూ చర్యలు తీసుకునేందుకు రోజులు గడిపారు. దీంతో విద్యార్థులు మరోసారి పాఠశాల ముందు నిరసన తెలిపారు. పోలీసులు సైతం కేవలం వేధింపులకు గురిచేస్తున్న అంశంలోనే కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కేసు విషయంలోనూ పోలీసులు గోప్యం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అయినా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు టీచర్ గత తొమ్మిది రోజులుగా పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విధులు నిర్వర్తిస్తోంది. సరిగ్గా ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే మూల్యాంకనం విధుల్లోకి తీసుకోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలు తెరవెనక సహకరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.