22-04-2025 01:42:10 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): భూమిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మనుగడ ఉంటుందని, భూమి ప్రాముఖ్యత, భూమిని కాపాడుకోవడం కోసం చేపట్టాల్సిన చర్యలపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు రాచకొండ ఏకాంబరం మాట్లాడుతూ భూమిని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు రక్షణ ఉంటుందన్నారు. మానవుడు అభివృద్ధి పేరిట దరిత్రిని ధ్వంసం చేసే కార్యక్రమాలు చేపడుతుండడంతో భూసారం కలుషితం అవుతుందని చెప్పారు. పంటల దిగుబడి కోసం రసాయన ఎరువులు విరివిగా ఉపయోగించడం వల్ల భూసారం దెబ్బతింటుందని, ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల , భూమి కలుషితం కావడంతో మానవ జీవనానికి అనేకమైన ఆటంకాలతో, పాటు క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. మొక్కలను పెంచి ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.