calender_icon.png 1 March, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులు వార్డెన్ లు కృషి చేయాలి

01-03-2025 06:22:35 PM

భద్రాచలం (విజయక్రాంతి): గిరిజన విద్యార్థినీ విద్యార్థుల చక్కటి చదువు, మెనూ ప్రకారం భోజనంతో పాటు వారి వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా సంబంధిత హెచ్ఎం వార్డెన్, ఏఎన్ఎంలు సమన్వయంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శనివారం భద్రాచలంలోని బీఈడీ కళాశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని హెచ్ఎం, వార్డెన్,  ఏఎన్ఎం లకు గిరిజన సంక్షేమ శాఖలో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యంపై తీసుకోవలసిన చర్యలపై ఒకరోజు నిర్వహించిన వృత్యంతర శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు 24 గంటలు వారు పనిచేస్తున్న చోట ఉండి ప్రతిరోజు పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని, అనారోగ్యానికి గురి అయిన పిల్లలను వేరేచోట ఉంచి వైద్య పరీక్షలు చేయించాలని, పిల్లల యొక్క వ్యక్తిగత శుభ్రత గురించి తెలియజేయాలని, అలాగే పాఠశాలల్లో ఉన్న సిక్ రూమ్ శుభ్రంగా ఉండేలా చూడాలని, అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను దగ్గర్లోని పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్యం చేయించాలని, విద్యార్థికి అనారోగ్యం తీవ్రంగా ఉంటే ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించాలని ఈ విషయాన్ని హెచ్ఎం ద్వారా పై అధికారుల దృష్టికి తీసుకొని రావాలన్నారు.

మీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉండే డాక్టర్లతో, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హెచ్ఈఓ లతో కోఆర్డినేషన్ తో ఉంటూ ప్రతినెల విద్యార్థులకు వైద్యానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయించాలన్నారు. పాఠశాలల్లో ఉండే విద్యార్థినీ విద్యార్థులకు సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించాలని, కిషోర బాల బాలికలకు అవసరమైన కౌన్సిలింగ్ మహిళా డాక్టర్లచే ఏర్పాటు చేయించాలన్నారు. సిక్ రూమ్ లో తగినంత గాలి వెలుతురు ప్రసరించేలా చూడాలని, ఉపయోగించిన బెడ్లు, బెడ్ షీట్స్ బ్లాంకెట్స్ పిల్లో కవర్స్ మార్పించి ఉతికించి శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను పాటించేలా చూసి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దుస్తులు రోజు మార్చుకునేలా చూడాలని, పాఠశాలల్లో శుభ్రమైన మంచినీరు ఎప్పుడూ గదిలో అందుబాటు ఉండేలా చూసి, సిక్ ఉన్న విద్యార్థులు సాత్వికంగా ఆహారం తీసుకొని సమయానుకూలంగా మందులు వేసుకొనేలా చూడాలన్నారు.

పనికిరాని వస్తువులు సంబంధం లేని వస్తువులు ఏవి సిక్ రూములో ఉంచకూడదని, పిల్లలు ఎవరైనా ఇంటికి వెళ్లేటప్పుడు వారి తల్లిదండ్రులకు వారి ఆరోగ్య సమస్యల గురించి తెలియజేయాలని, తిరిగి వచ్చిన తర్వాత పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉన్నది గమనించాలని అన్నారు. ఏఎన్ఎంలు మీ దగ్గరలో ఉన్న పీహెచ్సీ నుండి తగినన్ని మందులు తీసుకొని అందుబాటులో ఉంచుకోవాలని, డాక్టర్లు గనక ఇవ్వకపోతే వెంటనే నా దృష్టికి తీసుకొని రావాలని, పాఠశాలల్లోని పరిసరాలు వంటగది శానిటేషన్ పరంగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో పనిచేసే ఎన్ఎంలకు మెడికల్ కిట్లు త్వరలో అందిస్తామని విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యపరంగా మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మణెమ్మ, విజయలక్ష్మి, ఏ సీఎంవో రమణయ్య, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరు నాయక్, హెల్త్ కమాండ్ సెంటర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఎంహెచ్వో చైతన్య, ఏటీడీవోలు, హెచ్ఎం, వార్డెన్లు, పీహెచ్సీ డాక్టర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.