బ్లాక్‌మెయిల్ చేస్తూ నెలలపాటు లైంగికదాడి
కాన్పూర్, నవంబర్ 9: నీట్ కోచింగ్ కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ ప్రముఖ సంస్థలో చేరిన మైనర్ విద్యార్థినిపై ఇద్దరు టీచర్లు కిరాతకంగా ప్రవర్తించారు. ఆరు నెలల పాటు బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్న సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో టీచర్లలో ఒకరిని కొన్ని నెలల క్రితం అరెస్టు చేయగా.. లైంగికదాడికి గురైన అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు ఉపాధ్యాయుల్ని అరెస్టు చేశారు.
2022లో నీట్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు బాధితురాలు కాన్పూర్‌కు వెళ్లింది. 2023 డిసెంబర్ 31న బయాలజీ టీచర్ సాహిల్ సిద్దిఖీ తన ఇంట్లో జరిగిన పార్టీకి బాధితురాలిని ఆహ్వానించి డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఆ వీడియోలను బయటపెడతామని బెదిరించి అనేక సందర్భాల్లో అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
తనను సిద్దిఖీ కొన్ని రోజులు తన ఫ్లాట్‌లోనే బందీగా ఉంచాడని తెలిపింది. పలు పార్టీలకు బలవంతంగా తీసుకెళ్లేవాడని, అలాంటి ఒక పార్టీలోనే కెమిస్ట్రీ టీచర్ వికాస్ పోర్వాల్ కూడా తనపై అత్యాచారం చేసినట్లు చెప్పింది. బాలిక ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సిద్దిఖీ, వికాస్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.