calender_icon.png 13 November, 2024 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాభివృద్ధిలో టీచర్ సంఘాలది కీలకపాత్ర

31-08-2024 01:35:20 AM

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి  

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయ సంఘాలు తమవంతు పాత్ర పోషించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇ.వెంకట నర్సింహారెడ్డి సూచించారు. దోమలగూడలోని పింగళి వెంకట్ రాంరెడ్డి కన్వెన్షన్ హాల్‌లో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగలి శ్రీపాల్ రెడ్డి అధ్యక్షతన జరింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డైరెక్టర్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ కమలాకర్‌రావు విద్యారంగానికి విశిష్టమైన సేవలందించారని, ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేశారని పేర్కొన్నారు.

సంఘాలు కేవలం ఉపాధ్యాయ సమస్యలపైనే కాకుండా మారుతున్న సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పెంపొందించుకునే విధంగా తగిన పాత్ర పోషించాలని కోరారు. ఉపాధ్యాయులు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ పనిచేసేందుకు ముందుకురావాలని సూచించారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రతి నెలా మొదటి తేదీన వేతనాలు అందిస్తూ బదిలీలు, పదోన్నతులు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డీఏలను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్ రెడ్డి, పూల రవీందర్, మాజీ బాధ్యులు వెంకట్ రెడ్డి,  సదానంద్ గౌడ్, లింగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, కటకం రమేశ్, రాజగంగారెడ్డి, టీజీవో నేతలు శ్రీనివాస రావ్, సత్యనారాయణ,  టీచర్లు తదితరులు పాల్గొన్నారు.