20-03-2025 10:10:24 AM
టేకులపల్లి, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం(Tekulapalli Mandal) గంగారం పంచాయతీ పరిధిలోని సంపత్ నగర్ ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల డిప్యూటీ వార్డెన్ అసభ్య ప్రవర్తన చేశారన్న ఆరోపణ వచ్చింది. మంగళవారం ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి విషయాన్ని తెలిపింది. కుటుంబ సభ్యులు వెంటనే పాఠశాలకు వెళ్లగా ఆ ఉపాధ్యాయుడు లేరు. బుధవారం వెళ్లి విచారించగా ఆయన పాఠశాలలో ఉండటంతో వార్డెన్ పై కుటుంబ సభ్యుల దాడిచేసి చితక బాదారు. విషయం తెలుసుకున్న బోడు పోలీసులు సంపత్ నగర్ ఆశ్రమ పాఠశాల(Sampath Nagar Ashram School)కు వెళ్లి విచారణ చేపట్టారు. ఇదిలాఉండగా విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, సంబంధిత ఉపాధ్యాయున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విషయం తెలిసిన టేకులపల్లి ఉప తహశీల్ధార్ ముత్తయ్య, ఐటిడిఏ అధికారులు కూడా పాఠశాలకు చేరుకొని వివరాలు సేకరించారు. సంఘటన వివరాలు తెలిసిన టేకులపల్లి సిఐ తాటిపాముల సురేష్ బోడు పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణ చేపట్టారు.