నెల జీతం తీసుకోకుండానే మృత్యు ఒడికి..
మహబూబాబాద్, నవంబర్ 25: కోటి ఆశలతో కన్న కలలు ఒక్క రోడ్డు ప్రమాదం ఆవిరి చేసింది. సమాజం వెక్కిరించినా పట్టుదలతో ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించినా.. నెల జీతం తీసుకోకుండానే మృత్యువు కబలించింది. కుటుంబ పెద్దకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో ఉన్న ఆ కుబుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటకు చెందిన సండ్ర ఉపేందర్(45) ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఏండ్లుగా శ్రమించి ఎట్టకేలకు ఇటీవల విడుదలైన 2024 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యాడు.
అప్పటికే సూటిపోటి మాటలతో వేధిస్తున్న సమా జం, అనేక సమస్యలు తనను వేధిస్తున్నప్పుడు జీవితంలో ఇక తనకు రాదనుకున్న ఉద్యోగాన్ని సాధించడంతో తన భార్య, పిల్లలు కూడా సంబురంలో మునిగిపోయారు. గంగారం మండలంలోని మర్రిగూడెం ఫుల్‌సమ్ వారి గుంపు పాఠశాలలో ఉపేందర్‌కు పోస్టింగ్ వచ్చింది. సోమవారం పాఠశాలకు వెళ్లేందుకు బైక్‌పై కొత్తపేట నుంచి వెళ్తుండగా బావురగొండ మూలమలుపు వద్ద వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య స్వప్న, కుమారుడు ప్రేమతేజ, కూతురు శాన్విత ఉన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతన్నాయి.