calender_icon.png 22 April, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో పాపం టీచర్..

22-04-2025 10:40:14 PM

ప్రమాదవశాత్తు మృతి..

24 గంటల తర్వాత గుర్తింపు.. 

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు టాయిలెట్ గదిలో మరణించగా 24 గంటల తర్వాత గుర్తించిన ఘటన చూసిన ప్రతి ఒక్కరు అయ్యో పాపం టీచర్ అంటూ కంటతడి పెట్టారు. పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న ఎండి.నూర్జహాన్ భర్త చాలాకాలం క్రితం చనిపోయాడు. ఇద్దరు కూతుర్లు ఉండగా ఒక కూతురు వివాహం జరగగా, మరో కూతురు హైదరాబాదులో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్ళింది. ఒంటరిగా అద్దె గృహంలో ఉంటున్న టీచర్ సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లగా అక్కడే ప్రమాదవశాత్తు జారీ పడి మరణించి ఉంటారని భావిస్తున్నారు.

మంగళవారం వరకు కూడా టీచర్ ఇంటి నుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా టాయిలెట్లో విగత జీవిగా పడి ఉన్న టీచర్ నూర్జహాన్ ను గుర్తించారు. వెంటనే ఆమె కూతుర్లకు సమాచారం ఇవ్వగా పెద్ద కూతురు నజియా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై మురళీధర్ రాజ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. అందరితో కలుపుగోలుగా ఉండే టీచర్ నూర్జహాన్ అకాల మృత్యువాత పాడడంతో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు శోకసంద్రంలో మునిగారు.