ప్రభుత్వ పాఠశాలలో ఘటన.
తల్లిదండ్రులంతా కలిసి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి.
నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగులలో ఘటన.
అచ్చంపేట: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో ఆటల పోటీలను నిర్వహించగా విద్యార్థులు అల్లరి చేశారన్న కోపంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయుడు పాఠశాల విద్యార్థిపై చెప్పులతో దాడికి దిగాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కొండనాగుల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకోగా శనివారం వెలుగులో వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 26న జరగనున్న గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని కొండనాగుల పాఠశాలలో ఆటల పోటీలను నిర్వహించగా విద్యార్థులు ఆ సమయంలో అల్లరి చేశారని ఆ పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు సహనం కోల్పోయి విద్యార్థులపై చెప్పులు విసిరాడు. దీంతో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి గాయాలయ్యాయి. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో శనివారం ఉదయం పాఠశాలకు చేరుకొని సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పాఠశాల హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై డివో రమేష్ కుమార్ ను వివరణ కోరగా విచారణ జరిపి సదరు ఉపాధ్యాయుడిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.