calender_icon.png 26 December, 2024 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్‌కు తెలుగు నేర్పించా!

03-12-2024 12:00:00 AM

ఆచార్య యుద్దనపూడి రెడ్డి శ్యామల.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠాధిపతిగా, నిఘంటు నిర్మాణ శాఖాధిపతిగా.. అందరికీ సుపరిచితురాలు. 22వేల పదాలతో.. విద్యార్థుల కోసం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తరపున నిఘంటువును రూపొందించి.. తెలుగు భాషాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి తెలుగు పాఠాలు బోధించడంలో రెడ్డి శ్యామల గారిది కీలకపాత్ర. తెలుగు భాషాశాస్త్రంలో, నిఘంటువుల రూపకల్పనలో ఆమె కృషి ఎనలేనిది. తెలుగు భాషకు ఆమె చేసిన శ్రమ ఫలితం తరతరాలకూ నిలుస్తుందనేది అక్షర సత్యం. బోధకురాలిగా, గురువుగా మూడు దశాబ్దాల ప్రయాణాన్ని ‘విజయక్రాంతి’తో పంచుకురామె..   

1989లో తెలుగు విశ్వవిద్యాయంలో ఒక ప్రాజెక్టు అస్టిసెంట్‌గా నా పదవీ బాధ్యతను స్వీకరించా. తర్వాత అంచలంచలుగా పదోన్నతులు, బాధ్యతలు పెరుగుతూ.. ఈరోజు ఒక సీనియర్ ప్రొఫెసర్‌గా విశ్వవిద్యాలయం నుంచి పదవీ విరమణ పొందాను. నేను మొదట నిఘంటువు నిర్మాణ శాఖలో చేరాను.అప్పటి నుంచి నిఘంటువులు, భాషా బోధన అనే రెండు అంశాల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేస్తూ వచ్చా.

ఈ రెండు రంగాలు కూడా మన సమాజానికి అవసరమైనా విభాగాలు. నిఘంటువు నిర్మాణం అనే దానికంటే.. ఒక డిక్షనరీ అనే మాట తొందరగా అర్థం అవుతుంది అందరికి. నిఘంటువును తయారు చేయడం అతి కష్టమైన విషయం.

ద్వితీయ భాషగా.. 

ప్రపంచం చాలా మారుతూ వస్తుంది. ఒక ప్రదేశం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడం.. లేదా వేరే భాష మాట్లాడే వారు మన భాషను నేర్చుకోవడం.. వైద్య, విద్య, సామాజిక అంశాలకు సంబంధించిన అవసరాలకు మరొక భాషను నేర్చుకోవాల్సిన అవసరం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఒక భాష మాతృభాషగా కలిగిన వాళ్లు మరొక భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కొంతమంది పాఠాశాలల్లో  ఫ్రెంచ్‌ను రెండో భాషగా పెడుతున్నారు. ఈ స్థాయిలో ద్వితీయ భాషగా తెలుగును బోధించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. 

మంచి భవిష్యత్!

ఎంఫిల్  హిందీ మాతృభాష గల వాళ్లకి తెలుగు భాషను ఏలా భోదించాలి అనే దాని మీద పరిశోధన చేశా. తర్వాత సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాన్ లాంగ్వేజేస్ మైసూర్‌లో చేశాను. అమెరికా, క్రొయెషియా, ఫిలిప్పియన్స్, జపాన్ నుంచి వచ్చిన వాళ్లు.. మన విశ్వవిద్యాలయంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.

వీళ్లకు తెలుగు భాష నేర్పేటప్పుడు ఎలా నేర్పాలి? ఏ స్థాయి నుంచి నేర్పాలి? ఇలాంటివన్నింటినీ కూడా నేను పుస్తకాల రూపంలో, ప్రణాళికలు రూపొందించా. దీనికి సంబంధించి పీజీ డిప్లొమా అండ్ డిక్షనరీ మేకింగ్ రెండు కోర్సులు ప్రారంభించా. ఇవి కూడా నడుస్తున్నాయి. ఈ రంగాల్లో పరిశోధన, అధ్యయనం, ఆసక్తి ఉన్నవారికి మంచి భవిష్యత్ ఉంటుంది. 

త్వరలో వెబ్‌సైట్.. 

తెలుగు భాషలో న్యాయ శాస్త్రాన్ని, ఇతర శాస్త్రాలను అభివృద్ది పరచాలని నేషనల్ ఎడ్యుకేషన్ ఫాలసీ 2023లో కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసుకుని డాక్యుమెంట్‌ను తయారు చేసింది. చాలామంది భారతీయ భాషల్లో అంటే తెలుగు, తమిళ్, హిందీ.. వంటి భాషల్లో కూడా శాస్త్ర సాంకేతికమైనటువంటి విషయాలను అభివృద్ధి పరచాలి అనుకుంటున్నారు. ఎందుకంటే పరభాషలో నేర్చుకున్నది అంతగా మనల్ని ప్రభావితం చేయలేదు.

ఆలోచనలను రేకెత్తించలేదు. కాబట్టి 25 శాస్త్రాలకు సంబంధించిన పదకోశాలను కూడా తయారు చేశాం. అవన్నీ కూడా ఇంతకూ ముందు ఉన్నావే.. వాటిని సేకరణ చేసి ఒక చోటకు తీసుకొచ్చాం. యూజీసీ, గవర్నర్ ప్రత్యేక నిధులతో ఈ పనులు జరిగాయి. త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుంది. 

మాతృభాషలో బోధన.. 

ప్రాథమికమైన జ్ఞానాన్ని మాతృభాషలో పొందిన విద్యార్థికి మేధ సంపత్తి బాగా పెరుగుతుంది. అప్పుడు వాళ్ల వికాసం వల్ల పరిశోధనల్లో తెలుగులోనే కాదు ఏ భాషలోనైనా.. ఏ రంగంలోనైనా.. భౌగోళికం కావచ్చు.. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం కావచ్చు.. జువాలజీ.. ఇలాంటి అన్నీ శాస్త్రాల్లో కూడా మౌలికమైనటువంటి పరిశోధనలకు వాళ్ల బుద్ధి వికాసానికి తెలుగులో బోధన అనేది ఉపకరిస్తుంది.

కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాతృభాషలోనే విద్యబోధన చేయలని గట్టిగా సంకల్పించింది. వాటికి సంబంధించినటువంటి.. కార్యాచరణ కూడా మొదలైంది. యూనెస్కో కూడా చెబుత్నుది.. భాషలను బతికించుకోవాలి అని. ప్రాథమిక విద్య తప్పకుండా మాతృభాషలో జరగాలి అని రాజ్యంగం కూడా చెబుతున్నది. భాషను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉన్నది.

కనీసం పది సంవత్సరాలు..

తెలుగుకు ఒక సమగ్ర నిఘంటువు తయారు చేయాలంటే.. కనీసం ఒక పది సంవత్సరాలు పడుతుంది. దీనికి తగినంత నిధులను సమకూర్చితే.. ఒక పదిమంది రకరకాల స్థాయిల్లో పని చేయాల్సి ఉంటుంది. కొంతమంది పదాలను సేకరించడం, తర్వాత ప్రాథమికమైనటువంటి అర్థాన్ని కూర్చేవాళ్లుంటారు, తర్వాత నిర్ధిష్టమైన అర్థాన్ని నిరూపించడం. ఇలా మూడు స్థాయిల్లో ఒక పదానికి అర్థాన్ని నిరూపించడం జరుగుతుంది. ఉదాహరణకు లావు అంటే స్థూలకాయం అనుకుంటాం.. కాని నన్నయ్య కాలంలో లావు అంటే బలం అని అర్థం ఉండేది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా నిఘంటువులు ఉండాలి. 

విద్యరంగంలో నిర్లక్ష్యం.. 

విద్యరంగంలో మన భాషను నిర్లక్ష్యం చేస్తున్నాం. అందువల్ల కేవలం ఉద్యోగులుగా మారిపోయి.. ఒక పరిపూర్ణమైనటువంటి శాస్త్రవేత్తలుగా మారలేని పరిస్థితి వస్తుంది. విద్యరంగంలో మన మాతృభాషను పక్కకు పెట్టేస్తున్నాం. చిన్నప్పటి నుంచి భాష మీద ఉన్న సామర్థ్యాన్ని చదువులో ఉపయోగించుకోలేకపోతున్నాం. అలా ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఆలోచనలకు కావాల్సినటువంటి పద సంపదను మెదడు అందించలేకపోతున్నది. మన మెదడు ఎలా ఉంటుందంటే.. ఎన్ని భాషలను నేర్చుకుంటే అంతగా పదును తేలుతుంది. 

ఆమెకు ధన్యవాదాలు!

తెలంగాణ రాష్ట్రానికి గవర్నరుగా బాధ్యతలు స్వీకరించాకే తెలుగు నేర్చుకున్నారు.  ఇక్కడి వాళ్లతో ఇక్కడి మాతృభాషలో మాట్లాడినప్పుడే, అవి నేరుగా వాళ్ల హృదయాలకు చేరుతాయని ఆమె నమ్మకం. పైగా ప్రజల భాష తెలియకుండా.. వాళ్ల సాధకబాధకాలు తెలుసుకోలేను. కనుక కాస్త కష్టమైనా ఇష్టంగా తెలుగు నేర్పించమని గవర్నర్ తమిళిసై నుంచి పిలుపు వచ్చింది.

ఆవిడ నన్ను అంగీకరించారు. ముందుగా దానికి ధన్యవాదాలు. మొదటగా ఆమెతో ఇంగ్లీష్ ద్వారా కొంత పాఠాలు నేర్పేది.. ఆవిడ చాలా త్వరగా గ్రహించేది. తమిళంలో కూడా పాఠాలు చేప్పేదాన్ని అందువల్ల సులభంగా తెలుగు భాషను నేర్చుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా తరగతులు తీసుకున్నాను.

లాక్‌డౌన్ సమయాన్ని ఆమె చక్కగా వినియోగించుకున్నారు. తర్వాత కూడా వారానికి నాలుగు రోజులు ప్రత్యక్షంగానూ బోధించాను. ఒక పదాన్ని ఒకసారి వింటే చాలు.. ఇట్టే గుర్తు పెట్టుకుంటారు. చాలా వేగంగా నేర్చుకున్నారు. తెలంగాణ సంస్కృతి పట్ల ఆమెకు మమకారం ఎక్కువ.