calender_icon.png 28 April, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల రక్షణకు ‘టీ సేఫ్’

28-04-2025 12:47:43 AM

  1. ఏడాది కింద అందుబాటులోకి..
  2. అవగాహన లేక నిరుపయోగం

మెదక్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగు తూనే ఉన్నాయి. ఇటీవల నగరం నడిబొడ్డున ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఇ లాంటి దారుణాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఏడాది క్రితం టీ సేఫ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

కేవలం మహిళల రక్షణ కోసమే ఈ యాప్ను రూపకల్పన చేశారు. అయితే ఏడా ది కావస్తున్నా యాప్ను వినియోగిస్తున్న వారి సంఖ్య చాలా తక్కవుగా ఉంది. మహిళలు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు టీ సేఫ్ యాప్లో నమోదు చేసుకోవడం ద్వారా సురక్షితంగా గమ్యం చేరవచ్చని పోలీసులు అంటున్నారు. 

వినియోగించడం ఇలా...

మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా టీ సేఫ్ యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే రాష్ట్ర పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చిన యాప్ కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసి రిజిష్టర్ అవ్వాల్సి ఉంటుంది. హెల్ప్ సిటిజన్ విభాగంలో క్లిక్ చేసి ప్రయాణిస్తున్న ప్రాంతం పేరు, ప్రయాణిస్తున్న వాహనం, దాని రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి.

ఒకవేళ రైలు ప్రయాణం చేస్తే ఆ రైలు రూట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. అనంతరం ప్రయాణం ప్రారంభించే ముందు స్టార్ట్ బటన్ నొక్కగానే సదరు సమాచారం పోలీసు శాఖ పర్యవేక్షణలోకి వెళ్తుంది. ఇక అప్పటి నుండి ఆ వాహనం లోకేషన్ గమ్యం చేసేవరకు పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. 

నిమిషాల్లోనే సమాచారం..

ప్రయాణిస్తున్న వాహనం రూటు మారి నా, ప్రయాణ సమయానికన్నా ఆలస్యం అయినా పోలీసుల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మెసేజ్లు వస్తాయి. దానికి వినియోగదారుల నుంచి రిప్లే ఇవ్వకుంటే కేసును అనుమానాస్పదం గా పరిగణించి నేరుగా ప్రయాణిస్తున్న వాహనం వివరాలు డయల్ 100కు వెళ్తాయి. లొకేషన్ ఆధారంగా సమీప పోలీస్ స్టేషన్ లేదా పెట్రో లింగ్ వాహనానికి సమాచారం చేరవేస్తా రు.

నిమిషాల వ్యవధిలో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని బట్టి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అనుకోని సందర్భాల్లో, విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడే మహిళలను రక్షించేందుకు ఈ యాప్ చక్కగా ఉపయోగపడుతుం దని, ఒంటరి మహిళలకు, యువతులకు రక్షణ కవచంలా పని చేస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

అవగాహన కరువు..

మెదక్ జిల్లాలో టీ సేఫ్ యాప్ గురించి పోలీసు శాఖ అవగాహన కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. డయల్ 100, షీ టీంల పనితీరుపై అవగాహన సదస్సు పెడుతున్నారు తప్ప కొత్తగా ప్రవేశపెట్టిన టీ సేఫ్ యాప్ గురించి మహిళలకు, విద్యార్థినులకు అవగాహన కల్పించడం లేదు. ఇప్పటికైనా ఈ యాప్ గురించి అవగాహన కల్పిస్తే చాలా మంది యువతులకు రక్షణగా ఉం టుందని పలువురు భావిస్తున్నారు.