calender_icon.png 24 January, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంతల సమస్యలపై టీ రస్తా తరహా యాప్

24-01-2025 02:03:54 AM

* 4 వారాల గడువు ఇచ్చిన హైకోర్టు

* ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు ఆదేశం

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాం తి): రోడ్లపై గుంతల వల్ల ఎదురువుతున్న సమస్యలను పరిష్కరించే క్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు వీలుగా 4 వారాల్లోగా టీ రస్తా తరహాలో ఒక యాప్‌ను రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. యాప్‌ను రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు ఉత్తర్వులు జారీ చేసింది.

తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ జీ రాధారాణితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఆదేశించింది. రోడ్లపై గుంతలు, మ్యాన్‌హోళ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో పౌరులు మృత్యువాత పడుతున్నారంటూ న్యాయవాది కే అఖిల్ శ్రీగురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గుంతల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మ్యాన్‌హోళ్లలో పడి చనిపోయిన వాళ్ల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పిల్‌లో పేర్కొన్నారు. 

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ, ఆర్ అండ్ బీ ’టీ రస్తా’ యాప్‌ను నిర్వహిస్తోందని, దీని ద్వారా రాష్ట్రంలో 30 వేల కిలోమీటర్ల మేరకు రోడ్ల పర్యవేక్షణ ఉందన్నారు. పంచాయతీరాజ్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల పరిధిలో ఈ యాప్ లేదన్నారు. ఈ శాఖల పరిధిలో కూడా అదే తరహా యాప్‌ను రూపొందించాలని గత డిసెంబరు 16న ఇదే హైకోర్టు ఆదేశించిందని చెప్పారు.