బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లిలో టీడీపీ కార్యాలయాన్ని కబ్జా కోరుల నుండి ఖాళీ చేయించాలని టీడీపీ రాష్ట్ర మాజీ సెక్రటరీ, టీఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1983లో టిడిపి కార్యాలయం ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం పట్టణంలో ఐదుగుంటల స్థలాన్ని కేటాయించిందన్నారు. 1994లో టిడిపి నాయకులు కేవీ నారాయణరావు భూమి పూజ చేశారని చెప్పారు.
బెల్లంపల్లికి చెందిన శ్రీరాముల మహేష్ అనే వ్యక్తి దాన్ని ఆక్రమించి టిడిపి నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సదరు వ్యక్తి టిడిపి కార్యాలయం ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. టిడిపి కార్యాలయం ఖాళీ చేయనట్లయితే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ టీ. మనిరాంసింగ్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి గద్దల నారాయణ, పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ముదిగంటి దామోదర్ రెడ్డి ,జిల్లా రాష్ట్ర నాయకులు పెగడపల్లి రాజనర్సు ,చింతల రమేష్, గంగాధర్ గౌడ్ ,చిటికెల రాయలంగు తదితరులు పాల్గొన్నారు.