ముషీరాబాద్,(విజయక్రాంతి): జనగామ జిల్లా అమ్మాపురం మోతె జగన్నాథం ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ మణికొండ గురువారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘బొమ్మలోల్లు’ అని ఆప్యాయంగా పిలుచుకునే మోతె జగన్నాథం మృతి తెలంగాణ కళారంగానికి తీరని లోటన్నారు. చెక్కతీగల తోలుబొమ్మలాట ద్వారా శతాబ్ధాల నాటి కథా సంప్రదాయాన్ని పరిరక్షించడానికి అంకితమైన కళాకారుల బృంధానికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు. వీర ప్రదర్శనలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు, ప్రహ్లాద, రామదాసు కథలకు ప్రాణం పోశాయన్నారు.
ఈ కళా బృంధం యొక్క కళానైపుణ్యం తెలంగాణ ప్రాంతపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకే మోత కుటుంబానికి చెందిన రెండు బృందాలు మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన సంప్రదాయ సాంస్కృతిక రూపాన్ని గుర్తించాలని అన్నారు. అంతరించిపోతున్న ఈ సంప్రదాయాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కళను సజీవంగా ఉంచడంలో మిగిలిన కీలుబొమ్మల కుటుంబ కళాకారులను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలని అన్నారు. ఈ సందర్భంగా మోతె కుటుంబానికి తన ప్రగాడ సంతాపం తెలిపారు.