calender_icon.png 23 October, 2024 | 7:56 AM

టీసీఎస్ నికరలాభం రూ.12,040 కోట్లు

12-07-2024 12:05:00 AM

ముంబై, జూలై 11: దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2024 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ. 12,040 కోట్ల స్టాండెలోన్ నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదేకాలంలో నమోదుచేసిన రూ.11,120 కోట్లకంటే తాజా క్యూ1లో నికరలాభం 9 శాతం వృద్ధిచెందింది. విశ్లేషకులు అంచనాలకంటే కాస్త మించిన లాభాన్నే కనపర్చింది.  కంపెనీ ఆదాయం 5.4 శాతం వృద్ధితో రూ. 59,381 కోట్ల నుంచి రూ.62,613 కోట్లకు పెరిగింది. గత ఏడాది క్యూ1కంటే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికరలాభం పెరిగినప్పటికీ, స్వీక్వెన్షియల్‌గా 2024 మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 3 శాతం తగ్గింది. 2024 ఆర్థిక సంవత్సరం క్యూ4లో టీసీఎస్ రూ.12,502 కోట్ల నికరలాభాన్ని నమోదుచేసింది.

కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ నిరుడుకంటే 1.5 శాతం పెరిగి 24.7 శాతానికి చేరగా, నికర మార్జిన్ 19.2 శాతం వద్ద నిలిచింది. గురువారం సమావేశమైన టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 10 చొప్పున మధ్యంతర డివిడెండు సిఫార్సుచేసింది. డివిడెండుకు జూలై 20 రికార్డుతేదీగా నిర్ణయించింది. ఆగస్టు 5న చెల్లిస్తుంది. స్టాక్ మార్కెట్ వేళలు ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెల్లడయ్యాయి. టీసీఎస్ షేరు స్వల్పనష్టంతో రూ.3,902 వద్ద ముగిసింది. టీసీఎస్ క్యూ1 ఫలితాలు మార్కెట్ అంచనాల్ని మించాయని, ఈ కంపెనీ పనితీరునుబట్టి ఐటీ రంగం కోలుకుంటున్నదని తాము అంచనా వేస్తున్నట్టు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. 

భారత్‌లో వ్యాపారం 62 శాతం వృద్ధి

 టీసీఎస్ తన ప్రధాన మార్కెట్లన్నింటిలోనూ స్వీక్వెన్షియల్‌గా వ్యాపారాన్ని వృద్ధిపర్చుకున్నది. భారత్‌తో సహా వర్థమాన మార్కెట్లలో రెండంకెల్లో వృద్ధి సాధించింది. భారత్‌లో ప్రత్యేకించి 62 శాతం వృద్ధిని నమోదుచేసింది. కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే దాదాపు అన్ని వెర్టికల్స్‌లోనూ స్వీక్వెన్షియల్‌గా వ్యాపారాన్ని పెంచుకోగా, తయారీ రంగంలో టీసీఎస్ బిజినెస్ 9.4 శాతం వృద్ధిచెందింది. ఎనర్జీ, రిసోర్సెస్, యుటిలిటిటీస్ విభాగాల్లో 5.7 శాతం, లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్‌లో 4 శాతం చొప్పున వృద్ధిని కనపర్చింది.

పెరిగిన ఉద్యోగుల సంఖ్య

మూడు త్రైమాసికాలుగా తగ్గుతున్న ఉద్యోగుల సంఖ్యను క్యూ1లో టీసీఎస్ పెంచుకున్నది. 2024 జూన్ చివరినాటికి నికరంగా 5,452 మంది ఉద్యోగులు జత అయ్యారు. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో గత 19 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రోల్స్ నుంచి 13,249 మంది తగ్గారు. అలాగే క్యూ4లో 1,759 మంది తగ్గారు. 12.1 శాతం ఉద్యోగుల వలసలు జరిగాయి. 

* ‘కొత్త ఆర్థిక సంవత్సరాన్ని పటిష్టం గా ప్రారంభించాం. అన్ని మార్కెట్లు, పరిశ్రమలవారీగా వృద్ధి సాధించాం. ఎమర్జింగ్ టెక్నాలజీల్లో కొత్త సామర్థ్యాల్ని క్రియేట్ చేసుకుం టాం. నవకల్పనలో పెట్టుబడులు కొనసా గి స్తాం. ఏఐ కోసం  ఫ్రాన్స్‌లో టీసీఎస్ పేస్‌పోర్ట్, యూఎస్‌లో ఐఓటీ ల్యాబ్‌లను నెలకొల్పాం. లాటిన్ అమెరికా, కెనడా, యూరప్‌ల్లో డెలివరీ సెంటర్లను విస్తరిస్తున్నాం’

 కృతివాసన్, సీఈవో, టీసీఎస్