11.95 శాతం వృద్ధి
ఆదాయం రూ. 63,973 కోట్లు
షేరుకు రూ.66 ప్రత్యేక డివిడెండు
న్యూఢిల్లీ, జనవరి 9: ఐటీ దిగ్గజం, దేశంలో నంబర్‌వన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణమైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మూడవ త్రైమాసికంలో టీసీఎస్ నికరలాభం 11.95 శాతం వృద్ధిచెంది రూ. 12,380 కోట్లకు చేరింది.
గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ రూ. 11,058 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం సెప్టెంబర్ క్యూ2లో రూ. 11,909 కోట్ల నికరలాభాన్ని సాధించింది. ఈ క్యూ3లో టీసీఎస్ ఆదా యం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 5.6 శాతం వృద్ధితో రూ.60,583 కోట్ల నుంచి రూ. 63,973 కోట్లకు పెరిగింది. అయితే క్యూ2లో ఆర్జించిన రూ. 64,259 కోట్ల ఆదాయంతో పోలిస్తే క్యూ3లో తగ్గింది.
క్యూ3లో కంపెనీ గత క్యూ3 తరహాలోనే 24.5 శాతం ఆపరేటింగ్ మార్జిన్ సాధించగా, క్యూ2లో నమోదైన 24.1 శాతంకంటే మెరుగుపడింది. గురువారం సమావేశమైన టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.66 ప్రత్యేక డివిడెండుతో సహా మొత్తం రూ.76 చొప్పున డివిడెండు ప్రకటించింది. డివిడెండు చెల్లింపునకు కంపెనీ రూ. 21,000 కోట్లు ఖర్చుచేస్తుంది.
ఈ డివిడెండ్లను ఫిబ్రవరి 3న చెల్లించనున్నట్లు టీసీఎస్ తెలిపింది. టాటా గ్రూప్ నుంచి బెంగళూరులో రూ.1,625 కోట్ల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు టీసీఎస్ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో గురువారం టీసీఎస్ షేరు 1.72 శాతం తగ్గి రూ.4,036 వద్ద నిలిచింది.
ఇండియా ఆదాయంలో 70 శాతం వృద్ధి
క్యూ3లో దాదాపు అన్ని భౌగోళిక ప్రాంతాల నుంచి ఆదాయం తగ్గిందని, కానీ వర్థమాన దేశాల ఆదాయం దన్నుగా నిలిచిందని టీసీఎస్ సీఈవో కృతివాసన్ మీడి యాకు చెప్పారు. ఇండియా నుంచి తమ ఐటీ ఆదాయం 70 శాతం వృద్ధి చెందిందని, తమ మొత్తం ఆదాయంలో ఇప్పుడు ఇండి యా వాటా 9 శాతానికి చేరిందని తెలిపారు.
బీఎస్‌ఎన్‌ఎల్ డీల్ గత కొద్ది త్రైమాసికాలుగా టీసీఎస్ ఇండియా ఆదాయానికి మద్ద తు చేకూరుస్తున్నదని, అయితే ఇది ముగింపునకు వస్తున్నదని, ఈ లోటు ను భవిష్య త్తులో తమకు గ్లోబల్ బిజినెస్ సమకూరుస్తుందని సీఈవో వివరించారు.
కొత్త ఆర్డర్లు 10.2 బిలియన్ డాలర్లు
డిసెంబర్ త్రైమాసికంలో హాలిడే సీజన్ ఉన్నందున సహజంగానే ఐటీ కంపెనీలకు సవాళ్లతో కూడుకున్న కాలం అయినప్పటికీ, టీసీఎస్ 10.2 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లను సంపాదించింది. అంతర్జాతీయంగా బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం నుంచి 3.2 బిలియన్ డాలర్ల, కన్జూమర్ బిజినెస్ నుంచి 1.3 బిలియన్ డాలర్ల ఆర్డర్లు లభించాయన్నది.
5 వేల ఉద్యోగులు తగ్గుదల
ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో టీసీ ఎస్ పేరోల్స్ నుంచి 5,000 మంది ఉద్యోగు లు తగ్గారు. డిసెంబర్ చివరినాటికి మొత్తం 6.07 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగ వలసలు 13 శాతానికి పెరిగినట్లు టీసీఎస్ తెలిపింది. సిబ్బంది తగ్గుదలకు పలు అంశాలు కారణమని చీఫ్ హ్యుమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.
2024-25లో క్యాంపస్ హైరింగ్ ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నదని, 40,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మరిం త ఎక్కువ సంఖ్యలో క్యాం పస్ హైరింగ్ జరుపుతామన్నారు. జనరేటివ్ ఆర్టిఫీషి యల్ ఇంటిలిజెన్స్‌తో ఉద్యోగాలు పోతాయన్న భయాలను టీసీఎస్ సీఈవో కృతి వాసన్ కొట్టివేశారు.
ఈ కొత్త టెక్నాలజీ నికరంగా ఉద్యోగాలు పెంచుతున్నదని, అయి తే ప్రొఫైల్స్ భిన్నంగా ఉంటాయన్నారు. ఇప్పుడు పెద్ద డీల్స్‌లో జన్‌ఏఐ ఒక భాగమని, తమ ఐటీ సర్వీసుల్లో దీని భాగం 10-12 శాతం ఉన్నదని వెల్లడించారు.
కొన్ని స్థూల అంశాలు
ఐటీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతున్నప్పటికీ, అన్ని పరిశ్రమలు, భౌగోళిక ప్రాంతాలు, సర్వీసులైన్స్ నుంచి కొత్త ఆర్డర్లు సంపాదించాం. దీర్ఘకాలిక వృద్ధికి ఇది శుభసూచకం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్, కన్జూమర్ బిజినెస్‌లు వృద్ధిబాటలోకి వచ్చాయి. డిస్క్రీషనరీ స్పెండింగ్ కోలుకుంటున్న సంకేతాలు కన్పిస్తున్నాయి. భవిష్యత్ పట్ల విశ్వాసంతో ఉన్నాం
కృతివాసన్ సీఈవో, టీసీఎస్