హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (విజయక్రాంతి): అడ్తిదారులకు టీడీఎస్ విధించడం 194 క్యూ సెక్షన్ ప్రకారం న్యాయ సమ్మతం కాదని తెలంగాణ మార్కెట్ యాడ్స్ అడ్తి అండ్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కటకం పెంటయ్య, అడ్తి సెక్షన్ అధ్యక్షుడు లింగారెడ్డి, చిల్లీస్ సెక్షన్ అధ్యక్షుడు రాజేష్ డీ కరాణి అన్నారు.
అడ్తిదారులకు తక్షణమే టీడీఎస్ వసూళ్లను నిలుపుదల చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ మితాలి మధుస్మితకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. క్రయ విక్రయాల సందర్భంగా కమిషన్ మాత్రమే రైతుల నుంచి తీసుకుంటున్నందున టీడీఎస్‌ను అడ్తిదారులకు మినహాయించాలన్నారు.
ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీచేస్తామని హామీ ఇచ్చారు. అడ్తిదారుల పట్ల సానుకూలంగా స్పందించినందుకు ఈ సందర్భంగా ఆమెకు అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.