calender_icon.png 20 January, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్లో పన్ను రేట్లు తగ్గించాలి

20-01-2025 12:00:00 AM

ఆర్థిక సలహా మండలి సభ్యుడు శ్రీవాస్తవ సూచన

  • న్యూఢిల్లీ, జనవరి 19: ఆర్థికాభివృద్ధిని మెరుగుపర్చడానికి రానున్న బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని, అంతర్జాతీయ అనిశ్చితుల నడుమ మూలధన పెట్టుబడులకు అధిక కేటాయింపులు జరపాలని 16వ ఫైనాన్స్ కమిషన్ సలహా మండలి సభ్యుడు, ఎర్నస్ట్ అండ్ యంగ్ (ఈవై) చీఫ్ పాలసీ అడ్వయిజర్ డీకే శ్రీవాస్తవ సూచించారు.

పట్టణ వినియోగం బలహీనంగా ఉంటున్నందున వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడంతో పాటు మధ్యతరగతి పన్ను చెల్లిం పుదార్ల చేతిలో సొమ్ము పెంచేందుకు అదనపు మినహాయింపులు కల్పించాలని కోరా రు. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు భారత్ ఎకానమీకి అంత అనువు గాలేవని, ప్రభుత్వాలు దేశీయ డిమాండ్‌ను పెంచడం పై దృష్టిపెట్టాలని సూచించారు. 

కేపెక్స్ కేటాయింపులు 20 శాతం పెంచాలి

వచ్చే 2025 బడ్జెట్లో మూలధన వ్యయాలకు (కేపెక్స్) కేటాయింపుల్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకంటే 20 శాతం పెంచాలని శ్రీవాస్తవ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.8 శాతం, వచ్చే ఏడాది 4.4 శాతం చొప్పున ఉంటుందని అంచనా వేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు.

రెండు విభిన్న అంశాలైన ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక ఉద్దీపనల మధ్య బడ్జెట్లో సమతౌల్యాన్ని ప్రదర్శించాల్సి ఉన్నదని అంటూ పెట్టుబడుల మార్గంలోనూ, వినియోగం పెంచేదిశగానూ ఆర్థిక ఉద్దీపనకే ప్రభుత్వం మొగ్గుచూపుతుందని తాము అంచనా వేస్తున్నట్లు ఈవై చీఫ్ అడ్వయిజర్ వివరించారు. ఈ మార్గాన్ని అనుసరించినందునే గత మూడేండ్లుగా సబబైన ఆర్థికాభివృద్ధి సాధ్యపడిందన్నారు,

ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయాలు తగ్గినందునే వృద్ధి రేటు మందగించిందని తెలిపారు. కేపెక్స్‌కు గత బడ్జెట్లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించగా, 2024 ఏప్రిల్‌ెేనవంబర్ మధ్యకాలంలో రూ.5.13 లక్షల కోట్లు మాత్రమే ప్రభుత్వం వ్యయపర్చింది. వచ్చే బడ్జెట్లో పెట్టుబడుల వ్యయ కేటాయింపుల్ని పెంచడంతో పాటు వినియోగ వ్యయ కేటాయింపుల్ని అధికం చేయాలన్నారు.