03-04-2025 12:04:34 AM
రూ.1500కోట్ల ప్రాపర్టీకి పన్ను చెల్లించని మై హోం
ఇప్పటికే ఫ్యాక్టరీ పేరు పై రూ. వెయ్యి కోట్ల రుణం
రెండేళ్లుగా ఇదే తంతు. అధికారుల తీరుతో కోట్లల్లో నష్టపోతున్న గ్రామ పంచాయతీ
సూర్యాపేట, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మై హోం మాయాజాలం ప్రదర్శించి గ్రామ పంచాయితీకి పన్ను చెల్లించకపోవడంతో కోట్ల ఆదాయం పక్కదారి పడుతుంది. అధికార యంత్రాంగం సైతం పన్ను వసూలు చేయడం పక్కనపెట్టి తమ సొంత జేబులు నింపుకునే పనిలో పడ్డారనేఆరోపణలతో ఆస్తి పన్ని వస్తలేదు. ఏటా 9 కోట్లు పన్ను రూపంలో గ్రామ పంచాయతీకి ఆదాయం రావాల్సి ఉన్న తూతూ మంత్రంగా పన్ను వసూలు చేస్తూ ఆ మేజర్ గ్రామపంచాయతీకి ఏటా రూ.కోట్లలో నష్టం చేకూర్చుతు న్నారు.
ఇప్పటికే 400 ఎకరాల్లో సిమెంట్ పరిశ్రమ నిర్మించుకున్నా పన్ను మాత్రం 40 ఎకరాలకు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉండగా.. రెండేళ్ల క్రితం ప్రారంభించిన యూ నిట్4 కు రూపాయి కూడా పన్ను చెల్లించకపోవడం గమనార్హం. దీంతో సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామపంచాయతీ పెద్దదైన పన్ను వసూళ్లలో మాత్రం అందరి కంటే తక్కువ ఉండడంతో గ్రామ పంచాయి తీ అభివృద్దిలో వెనుకంజలో నిలుస్తుంది.
పన్ను వసూళ్లపై పట్టింపేది
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో రూ.10 లక్షలు విలువైన ఇంటికి రూ.1200 రూపాయలు చొప్పున ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. ఇంటి విలువలో వందకు 0.12పైసలు చొప్పున గ్రామపంచాయతీ పన్ను వసూలు చేస్తున్నారు. గ్రామపంచాయతీ పన్ను మొత్తంలో 8 శాతం అదనంగా గ్రంథాలయ పన్ను వసూలు చేస్తున్నారు. 10 లక్షలు విలువైన రెసిడెన్షియల్ ఇంటికి రూ.1200 చొప్పున పన్ను వసూలు చేస్తుండగా,అదే రూ.10 లక్షలు విలువైన కమర్షియల్ నిర్మాణానికి రూ.2500 చొప్పున పన్ను వసూలు చేస్తున్నారు.
ఈ చొప్పున మేళ్లచెరువు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న 3300 ఇండ్లకు గాను ఏటా రూ.30 లక్షలు వరకు పన్ను వసూలు అవుతుంది. మేళ్లచెర్వు గ్రామ పంచాయితి పరిదిలో ఇండ్ల నిర్మాణ విస్తీర్ణం మొత్తం 200 ఎకరాల వరకు ఉండగా ఇదే గ్రామపంచాయతీ పరిధిలో మైహోం సిమెంట్ పరిశ్రమ సుమారు రూ.1500 కోట్ల విలువైన యూనిట్4కు తక్కువలో తక్కువ రూ. 3 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు ఏటా గ్రామ పంచాయతీ పన్ను వసూలు చేయాల్సి ఉన్న రెండేళ్ల నుండి పన్ను చెల్లించకుండా దాటవేస్తున్నారు.
రెండేళ్ల నుండి ఇదే తంతు
రెండేళ్ల క్రితం మై హోమ్ సిమెంట్ సంస్థ యూనిట్4 ప్రాజెక్టు, అపార్ట్ మెంట్ల్లు నిర్మాణం పూర్తయినట్లుగా గ్రామపంచాయతీ నుండి ఆక్యుపెన్సి సర్టిఫికెట్, నిర్మాణాలకు ఇంటి నెంబర్లు జారీచేశారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామపంచాయతీ పరిధిలో 2022 సంవత్సరంలో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో మైహోమ్ సిమెంట్ పరిశ్రమ యూనిట్ 4 ప్లాంట్ ను నిర్మించింది.
ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు, గ్రామపంచాయతీ నుండి ఎన్‌ఓసి 2014లోనే తీసుకోగా 2022 సంవత్సరంలో నిర్మాణ పనులు మొదలుపెట్టారు. నిర్మాణ సమయంలో గ్రామపంచాయతీ నుండి లేఔట్ అనుమతులు తీసుకోలేదంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. భూ దాన్, సీలింగ్, ప్రభుత్వ భూముల్లో అక్రమం గా నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ పనులను నిలిపివేశారు.
నిర్మాణ వివరాలు, విస్తీర్ణం, ఎన్‌ఓసీలు చూపించకుండానే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేశారు. పూర్తిచేసిన ప్రాజెక్టుకు 2023 డిసెంబర్ నెలలో యూనిట్4ప్రాజెక్టుకు,400 మంది నివాస ఉండే అపార్ట్మెంట్లకు నిర్మాణం పూర్తయినట్లుగా ధ్రువీకరణ పత్రాలు, నిర్మాణాలకు ఇంటి నెంబర్లు పొందారు. కానీ ఇంటి నెంబర్లు జారీ చేయబడిన నిర్మాణాలకు 2023 24, 2024 25 ఆర్థిక సంవత్సరాలకు పన్ను వసూలు చేయాల్సి ఉన్నా రెండేళ్లుగా కనీసం గ్రామపంచాయతీ అధికారులు మైహోమ్ సంస్థను పన్ను అడగలేదు.
యూనిట్4 ప్లాంట్ కు రూ.1000కోట్లు బ్యాంకు లోన్
రూ.1500 కోట్లతో నిర్మించిన మైహోమ్ సిమెంట్స్ యూనిట్4 ప్లాంట్ కు ఆ సంస్థ సుమారు 80 ఎకరాలు విస్తీర్ణంలో ప్లాంట్ నిర్మాణానికి రూ.1000 కోట్లు బ్యాంకు లోన్ సైతం పొందారు. బ్యాంకు లోన్ మంజూరు చేసిన విలువ ప్రకారమైన గ్రామపంచాయతీ లెక్క కట్టి రూ.1000కోట్ల విలువైన నిర్మాణాలకు గ్రామపంచాయతీ పన్ను వసూలు చేయాల్సి ఉన్న మైహోమ్ సంస్థ నుండి పన్ను వసూలు చేయడం లేదు. దీంతో మేళ్లచెరువు గ్రామపంచాయతీకి ఏటా రూ.6 కోట్లు నష్టం వాటిల్లుతున్నట్లు ఓ అంచనా.
ఈ యూనిట్4 ప్రాజెక్టుకు రెండేళ్లుగా పన్ను వసూలు చేయకుండా వ్యక్తిగతంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది టాక్స్ డబ్బును తమ జేబులు నింపుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. మైహోమ్ సిమెంట్ పరిశ్రమ యూనిట్1, యూనిట్2, యూనిట్3, పవర్ ప్లాంట్ లు ఇతర గత పాత నిర్మాణానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ప్రస్తుతం గడిచిన రెండేళ్ల క్రితం అనుమతులు జారీ చేసిన రూ.1500కోట్ల విలువైన యూనిట్4 ప్లాంటుకు, అపార్ట్మెంట్లకు పన్ను వసూలు చేయకపోవడం వెనుక అధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మేళ్లచెరువు గ్రామపంచాయతీలో చోటుచేసుకుంటున్న పన్ను వసుళ్ల అవకతవకలపై విచారణ జరిపి పన్ను వసూలు చేసి గ్రామపంచాయతీ ఆదాయం పెంచాలని, గ్రామపంచాయతీ పన్ను డబ్బులను తమ సొంత ఖర్చులకోసం వినియోగించుకుంటున్న అధికార యంత్రాంగం పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో పన్ను వసూలు చేస్తాం
మైహోమ్ సిమెంట్ సంస్థ నుండి పన్ను వసూళ్లు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. పూర్తిస్థాయి విచారణంతరం చట్ట ప్రకారం ప్రతి రూపాయి పన్ను వసూలు చేస్తాం. షేక్ ఫరీద్, పంచాయతీ కార్యదర్శి మేళ్లచెరువు