calender_icon.png 22 November, 2024 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియాకు పన్ను పోటు!

22-11-2024 12:25:59 AM

  1. టార్గెట్ రీచ్‌కాని ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు
  2. ఉద్యోగులకు వేతనాలిచ్చేందుకు మల్లగుల్లాలు
  3. రోజు, నెలవారీ టార్గెట్స్ వెరీ పూర్
  4. మొత్తంగా మొండి బకాయిలు 6వేల కోట్లు
  5. డిసెంబర్ నుంచి స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): చెప్పుకునేందుకు మహానగరం.. దేశంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీల్లో ఒకటి. పేరెన్నిక గల బల్దియా.. గ్రేటర్ హైదరాబాద్. కానీ, ట్యాక్స్ వసూళ్లలో మాత్రం అత్యంత వెనుకబడింది. 15 ఏళ్ల నుంచి రూ.6 వేల కోట్ల మేర ప్రాపర్టీ ట్యాక్స్ పేరుకుపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బల్దియా పరిధిలో మొత్తం 30 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి నెల నెలా ఠంచనుగా రూ.120 కోట్ల మేర వేతనాలు జమ చేయాలి. అలాగే జీహెచ్‌ఎంసీ నిర్వహణకు దాదాపు రూ.2 వేల కోట్లు అవసరం. పేరుకున్న బకాయిలు, నిధుల లేమి కారణంగా రెండు నెలల నుంచి బల్దియా ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు సైతం ఇబ్బంది పడుతున్నదని తెలిసింది.

రోజువారీ, నెలవారీ ట్యాక్స్ వసూళ్లు అంతంతమాత్రంగా ఉండడంతోనే ఈ దుస్థి తి. మొండి బకాయిలను వసూలు చేసేందుకు తాజాగా జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. వచ్చే నెల నుంచే స్పెషల్ డ్రైవ్ ప్రారం భం కాబోతున్నట్లు తెలిసింది.

రోజువారీ టార్గెట్ రూ.30 కోట్లు

అక్టోబర్‌లో దసరా పండుగ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ మార్గంలో వేతనాలు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. నవంబర్ వేతనాలు సైతం రెండురోజుల ముందుగానే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. ప్రతి నెలా 1న ఉద్యోగులకు వేతనాలు అందాలంటే ప్రాపర్టీ టాక్స్ ప్రతినెలా ఠంచనుగా వసూలు కావాల్సి ఉన్నది.

ట్యాక్స్ వసూలుకు 345 బిల్ కలెక్టర్లు, 145 టాక్స్ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. వారికి జీహెచ్‌ఎంసీ రోజువారీ రూ.30 కోట్లు, నెలా నెలా రూ.129 కోట్ల వసూలు టార్గెట్ ఫిక్స్ అయింది. కానీ, ఆ టార్గెట్స్ ఏమీ ఆశజనకంగా లేవని తెలిసింది.

ట్యాక్స్ వసూళ్లు ఇలా

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 20 లక్షల గృహాలు ఉండగా, వీటి నుంచి 2022- 23లో మొత్తం రూ.1,660.38 కోట్లు, 2023--24లో రూ.1,914.87 కోట్ల పన్నులు వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌లో ఎర్లీ బర్డ్ స్కీం (5 శాతం రాయితీ) కింద సుమారు రూ. 827 కోట్లు వసూలైంది.

టార్గెట్ రూ.2,100 కోట్లలో ఇప్పటివరకు రూ.1,300 కోట్ల వరకు జీహెచ్‌ఎంసీ ఖాతాలో జమ అయింది. మార్చి లోపు మరో రూ.800 కోట్లు వసూలు కావాల్సి ఉంది. బల్దియాకు ప్రాపర్టీ టాక్స్ తప్ప, మరో రూపంలో పెద్దగా ఆదాయం లేదు.