calender_icon.png 31 October, 2024 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్ను భారం తగ్గించాలి.. ఆహార ధరల్ని అదుపు చేయాలి

21-06-2024 12:10:00 AM

నిర్మలా సీతారామన్‌కు పరిశ్రమ నేతలు, అసోసియేషన్ల వినతి

న్యూఢిల్లీ, జూన్ 20: వచ్చే కేంద్ర బడ్జెట్లో సామాన్యుడిపై పన్ను భారాన్ని తగ్గించాలని, ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయాలని, మూలధన పెట్టుబడులను సాగించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పరిశ్రమ నేతలు, అసోసియేషన్లు విజ్ఞప్తి చేశాయి. గురువారం ప్రి బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా సీతారామన్‌తో వివిధ పారిశ్రామిక చాంబర్ల ప్రతినిధులు సమావేశమైన సందర్భంగా ఈ వినతి చేశారు. జీడీపీ వృద్ధి మూమెంటం కొనసాగేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాల వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక, ప్రధానంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని పరిశ్రమ నేతలు విన్నవించారు. 

సీఐఐ ఎనిమిది పాయింట్లు

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రెసిడెంట్ సంజయ్‌పురి ఎనిమిది పాయింట్లను ఆర్థిక మంత్రికి సమర్పించారు. దిగువ ఆదాయపు పన్ను శ్లాబుల్లో పన్ను రేటు తగ్గించడం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక స్కీమ్ (పీఎల్‌ఐ) వంటి ఉపాధి కల్పనకు సంబంధించిన పోత్సాహక పథకాల్ని క్రమబద్దీకరిం చడం, వ్యాపార నిర్వహణను సరళతరం చేయడం వంటివి అందులో ఉన్నాయి. వ్యవసా యం, గ్రామీణాభివృద్ధికి సం బంధించి కొన్ని సిఫార్సులను సైతం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ  సమర్పించింది. 

క్యాపెక్స్ పెంచాలన్న ఫిక్కీ

మూలధన వ్యయాల్ని (క్యాపెక్స్) పెంచాలని, నవకల్పనకు ఊతమివ్వాలని, పన్నుల్ని సరళీకరించాలంటూ ఆర్థికమంత్రికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫిక్కీ) విజ్ఞప్తి చేసింది. సమావేశంలో ఫిక్కీ మాజీ ప్రెసిడెంట్ సుబ్రకాంత్ పండా ఒక ప్రెజెంటే షన్ ఇస్తూ వృద్ధి మూమెంటం కొనసాగేందుకు వినియోగ డిమాండ్ పెరిగే చర్యల్ని తీసుకోవాలని, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని, ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని, ఎంఎస్‌ఎంఈలకు మద్దతుగా ఉండాలని, నవకల్పనకు, పరిశోధనలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.

కొత్త ప్రభుత్వపు తొలి విధాన ప్రకటనే కేంద్ర బడ్జెట్ అయినందున, వచ్చే ఐదేండ్ల విధాన బాటను సూచించేలా ఇది ఉండాలని కోరారు. కిర్లోస్కర్ బ్రదర్స్ సీఎండీ సంజయ్ కిర్లోస్కర్, సుందరం ఫాజనర్స్ ఎండీ ఆరతి కృష్ణ, సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్, సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీరజ్ అఖౌరి, పీహెచ్‌డీ చాంబర్ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్, ఐఎంసీ చాంబర్ ప్రెసిడెంట్ సమీర్ సోమయ్య, అశోక్ లేలాండ్ వైస్ ప్రెసిడెంట్ యశపాల్, బయోకాన్ వైస్ ప్రెసిడెంట్ షెఫాలిలు సైతం బడ్జెట్లో పరిగణనలోకి తీసుకునేందుకు పలు కీలక సిఫార్సులు సమర్పించారు. జూలై ద్వితీయార్థంలో ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారని భావిస్తున్నారు.