calender_icon.png 18 October, 2024 | 1:34 PM

రైస్‌మిల్లులపై టాస్క్‌ఫోర్స్ దాడులు తూతూ మంత్రమే!

27-07-2024 04:37:10 AM

  1. కామారెడ్డి జిల్లాలో.. రైస్ మిల్లుల్లో తనిఖీల తతంగం ఇది
  2. షార్టేజీని వెల్లడించని అధికారులు

కామారెడ్డి, జూలై 26 (విజయక్రాంతి): ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు అప్పగించి రా రైస్‌ను, సీఎంఆర్ రైస్‌ను అప్పగించాలనే అగ్రిమెంట్ చేసుకుంటే, కొంతమంది రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించి సీఎంఆర్ రైస్‌ను ప్రభుత్వానికి అప్పగించడంలేదు. 2021 రబీ, ఖరీప్ సీజన్‌లో ప్రభుత్వం జిల్లాలో 162 రైస్‌మిల్లులకు ధాన్యాన్ని అప్పగించింది. అందులో 37 రైస్‌మిల్లుల యాజమానులు ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్‌ను అప్పగించలేదు. దీంతో జూన్ 30 వరకు ప్రభుత్వం గడువు విధించింది. అయినా రైస్‌మిల్లర్లు వినలేదు. 37 రైస్‌మిల్లులకు గాను ఒక రైస్‌మిల్ యాజమాని సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వగా, మిగతా 36 మంది రైస్‌మిల్లర్లు సీఎంఆర్ రైస్‌ను అప్పగించలేదు.

దానితో వారికి  ప్రభుత్వం నోటీసులను జారీచేసింది. వారు మరో రెండు నెలల గడువు కోరగా ప్రభుత్వం ఆ గడువు కూడా ఇచ్చింది. అప్పటిలోగా సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించ కుంటే ఆర్‌ఆర్ యాక్ట్ కింద ఆస్తులను రికవరీ చేయడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం మరోసారి నోటీసులను జారీచేసింది. 2022 సీజన్‌లో 162 రైస్‌మిల్లులకు ధాన్యాన్ని రబీ, ఖరీప్ సీజన్‌లో అప్పగించింది. రా రైస్‌ను రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించగా, సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వాల్సిన మిల్లర్లు ప్రభుత్వానికి ఆ బియ్యాన్ని అప్పగించకపోవడంతో ఎక్కువగా ధాన్యాన్ని అలాట్ చేసిన రైస్‌మిల్లులపై జూలై నెలలో టాస్క్‌పోర్స్ దాడులు జరిగాయి. ఇతర జిల్లాలకు చెందిన పౌరసరఫరాల అధికారులు బృందంగా వచ్చి తనిఖీలు చేపట్టారు.

అయితే ఈ తనిఖీలు తూతూ మంత్రంగా నిర్వహించి మమా అనిపించారు. రైస్‌మిల్లుల తనిఖీల్లో ధాన్యం నిల్వల్లో తక్కువ వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని తనిఖీలకు వచ్చిన అధికారులు బహిర్గతం చేయకుండా ఉన్నతాధికారులకు నివేదికలు పంపామని చేతులు దులుపుకున్నారు. జిల్లాలోని జంగంపల్లి, దోమకొండ, పాల్వంచ, రాజంపేట, సదాశివనగర్, బిక్కనూర్, మాచారెడ్డి, మండలాల్లోని రైస్‌మిల్లు ల్లో టాస్క్‌పోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలోని సీతారామ రైస్‌మిల్లులో ధాన్యం నిల్వలు పెట్టిన తీరు విస్తుగొలిపేలా ఉన్నాయి. ఆ నిల్వలను మూడు గంటలలోనే లెక్కించామని టాస్క్‌ఫోర్స్ బృందం చేతులు దులుపు కొని వెళ్లింది.

20 టన్నులు షార్టేజీ వచ్చినట్లు లెక్కల్లో తేల్చి వాటికి మిల్లు యాజమాని విష్ణువర్ధన్‌రావు జరిమానా విధించాలని చెప్పి వెళ్లినట్లు తెలుస్తున్నది. ఆ ఒక రైస్‌మిల్లులోనే సరిగా ధాన్యం బస్తాల లెక్కలు నిర్వహిస్తే రెండు రోజులు గడిచినా కూడా లెక్క తేలదు. ఈ తనిఖీలకు గతంలో కామారెడ్డి డీఎస్‌వోగా పనిచేసిన పద్మ తనిఖీలకు రావడం, ఆమె రైస్‌మిలర్లకు పాతపరి చయం ఉండటం వల్ల షార్టేజీ వివరాలను గోప్యంగా ఉంచారు.

ఏడు రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేపట్టగా ఏ ఒక్క రైస్‌మిల్లులో కూడా ధాన్యం లెక్కల బస్తాల వివరాల పట్టికలు లేకపోవడం అధికారులను విస్తుగొలిపేలా చేశాయి.  ఎక్కువగా రైస్‌మిల్లు యాజమానుల సంఘం బాధ్యులకు సంబంధించిన రైస్‌మిల్లులోనే తనిఖీలు నిర్వహించి ఎలాంటి షార్టేజీ రాలేదని స్థానిక అధికారులు చెప్పి చేతులు దులుపుకున్నారు. సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేపట్టి మమ అనిపించి వెళ్లారు. తనిఖీల్లో ఎదో గోల్‌మాల్ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

వివరాలు వెల్లడించలేదు

కామారెడ్డి జిల్లాలో టాస్క్‌పోర్స్ బృందా లు ఏడు రైస్‌మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. ధాన్యం నిల్వలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టార్‌లను పరిశీలించారు. ధాన్యం స్టాక్‌ను లెక్కించి గతంలో మిల్లుకు కేటాయించిన ధాన్యం వివరాలు, స్టాక్ లెక్కించిన వివరాలు సరిపోయాయా లేదా అనే కోణంలో పరిశీలించి వెళ్లారు. షార్టేజీ వివరాలను ఉన్నతాధికారులకే నివేదించారు. షార్టే జీ వచ్చిన మిల్లర్లకు జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం ఉంది.

 నిత్యానందం, జిల్లా పౌరసరఫరాలశాఖ ఇంచార్జి అధికారి, కామారెడ్డి