చార్మినార్, సెప్టెంబర్ 13: ఇంటినే బార్‌గా మార్చి అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న ఓ మహిళను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం టాస్క్‌ఫోర్స్ డీసీపీ వై.వి. ఎస్ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ అందె శ్రీనివాస్‌రావు ఆధ్వర్యం లో ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్‌ఐలు నర్సింహులు, ఆంజనేయు లు, నవీన్ బృందం.. ఉప్పుగూడ లలితాబాగ్‌లో నివసించే శోభారాణి అలియాస్ లలితమ్మ ఇంటిపై దాడి చేశారు.
ఈ దాడిలో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి ఎక్కవ ధరకు తన ఇంట్లోనే విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన కింగ్ ఫిషర్ బీర్లకు సంబంధించిన 40 కార్టన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ మారుతి కారును కూడా సీజ్ చేశారు. ఈమేరకు ఆమెను అరెస్ట్ చేసి ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. అనుమతి లేకుండా మద్యం విక్రయించడం తప్పని తెలిసినప్పటికీ పదేపదే లలితమ్మ ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఆమెపై ఇప్పటికే 28 కేసులు నమోదు ఐనట్లు పోలీసులు తెలిపారు.