11-04-2025 01:49:38 AM
బీజింగ్, ఏప్రిల్ 10: అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనాల మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చైనా ఉత్పత్తులపై 125శాతం సుంకాలు విధించడంతో పాటు గతంలో ఫెంటానిల్ అక్రమ రవాణా కోసం విధించిన 20 శాతం సుంకాలు కలుపుకుని పూర్తి సుంకాల శాతం 145కి చేరుకుంది.
మేము చైనీయులమని.. కవ్విం పు చర్యలకు భయపడి వెనక్కి తగ్గబోమని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా దిగుమతులపై అమెరికా 125% శాతం సుంకాలు ప్రకటించిన నేపథ్యంలో చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ‘మేము చైనీయులం. కవ్వింపు చర్యలకు భయపడం. వెనక్కి తగ్గం’ అని తన పోస్టులో మావో నింగ్ పేర్కొన్నారు.
దీంతోపాటు 1953లో అమెరికాతో యుద్ధం సందర్భంగా చైనా నాయకుడు మావో జెడాంగ్ ప్రసంగించిన వీడియోను మావో నింగ్ షేర్ చేశారు. ‘ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో మేము నిర్ణయించలేం. అది వాళ్ల ఇష్టం. యుద్ధం ఎంతకాలం కొనసాగినా మేము వెనక్కి తగ్గం. పూర్తిగా విజయం సాధించేవరకు పోరాటం చేస్తాం’ అని మావో జెడాంగ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
చర్చలకు సిద్ధం
సుంకాల పోరులో చివరి వరకూ పోరాడతామని చెబుతూనే ఘర్షణలను తాము కోరుకోవడం లేదని చైనా స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికా మాట్లాడాలని కోరుకుంటే తమ తలపులు తెరిచే ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి హి యోంగ్కియాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒత్తిళ్లు, బెరింపులు, బ్లాక్‌మెయిల్ ద్వారా చైనాను లొంగదీసుకోలేరని స్పష్టం చేశారు. ‘చైనా వైఖరి స్పష్టంగా స్థిరంగా ఉంది.
ఒక వేళ అమెరికా మాట్లాడాలని కోరుకుంటే, దానికి మా తలుపులు తెరిచే ఉన్నాయి. అ యితే, పరస్పర గౌరవం, సమానత్వం ఆధారంగా చర్చలు జరగాలి. చైనాను ఎదు ర్కోవడానికి ఒతిళ్లు, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ సరైన మార్గం కాదు. వాణిజ్య యుద్ధం లో విజేతలు ఉండరు. ఈ విషయంలో చైనా వైఖరి స్పష్టంగా ఉంది. అమెరికా తనదైన శైలిలో పట్టుబడితే, చివరి వరకూ పోరాడేందుకు చైనా సిద్ధంగా ఉంది’ అని పేర్కొన్నారు.
ముందు వరుసలో భారత్
సుంకాల విషయంలో ప్రపంచ దేశాలకు 90రోజులపాటు ఊరట కల్పించిన డొనాల్డ్ ట్రంప్.. ఇదే సమయంలో చైనాపై 125 శాతం సుంకాలను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అసమానతలకు చైనా దోహదపడుతోందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆరోపించారు.
చైనా పొరుగు దేశాలతో వాణిజ్య చర్చలు జరుగుతున్నట్టు వెల్లడించారు. అమెరికాతో వాణిజ్య చర్చలు జరుపుతున్న దేశాల జాబితాలో జపాన్, దక్షిణ కొరియా, ఇండియా, వియత్నాం వంటి దేశాలు ముందు వరుసలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ టారిఫ్ పాలసీని చైనాపై ఒత్తిడి తెచ్చే వ్యూహంగా ట్రంప్ పాలనా విభాగం అభివర్ణిస్తోంది.
75 దేశాలపై 90 రోజులపాటు టారిఫ్‌ల అమలును నిలిపివేస్తూ.. కేవలం చైనాపైనే 125 శాతం సుంకాలను ప్రకటించడం ద్వారా అమెరికాపై ప్రతికార సుంకాలను విధించొద్దనే సందేశాన్ని మిత్ర దేశాలకు ట్రంప్ పంపారని పేర్కొంటోంది.
145% శాతానికి చేరిన సుంకాలు
చైనా ఉత్పత్తులపై సుంకాలు 145 శాతానికి చేరుకున్నాయి. ఫెంటానిల్ అక్రమ రవాణాకు సంబంధించి విధించిన 20 శాతం సుంకాలతో కలిపి 145 శాతానికి చేరుకున్నాయని వైట్ హౌస్ వెల్లడించింది. మరోవైపు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించింది.