calender_icon.png 6 March, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్ 2 నుంచి సుంకాల మోత

06-03-2025 01:28:19 AM

భారత్, చైనాపై ప్రతీకార సుంకాల విధింపు

  1. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 
  2. అగ్రరాజ్యంపై డబ్ల్యూటీవోలో కెనడా ఫిర్యాదు

వాషింగ్టన్, మార్చి 5: భారత్, చైనాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే సుంకాల విషయంలో చైనా ఘాటు గా స్పందించింది. అగ్రరాజ్యం తమతో యుద్ధం చేయాలని నిశ్చయించుకుంటే.. అది సుంకాల యుద్ధమైనా, వాణిజ్య యుద్ధమైనా లేక మరోరకమైన యుద్ధమైనా చివరి వరకూ పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది.

రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ట్రంప్ తొలిసారిగా అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమా వేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్  కొన్ని దేశాలు దశాబ్దాలుగా అమెరికాపై టారిఫ్‌లు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు ఆయా దేశాలపై టారిఫ్ లు విధించే అవకాశం అమెరికాకు వచ్చిందన్నారు.

యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, భారత్ వంటి దేశాల ఉత్పత్తులపై అమెరికా తక్కువ సుంకాలు విధిస్తుంటే ఆయా దేశాలు మాత్రం అమెరికా ఉత్పత్తులపై అన్యాయంగా అత్యధికం గా టారిఫ్‌లు విధిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి భారత్ 100 శాతం కంటే ఎక్కువ సుంకాలను వసూ లు చేస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.

‘ఇండియా మన నుంచి 100శాతం కంటే ఎక్కువ టారిఫ్‌లు వసూలుచేస్తోంది. మన ఉత్పత్తులపై చైనా సగటు సుంకం మనం వసూలు చేసే దానికంటే రెండింతలు ఎక్కువ. దక్షిణ కొరియా సగటు సుంకం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ వ్యవస్థ వల్ల అమెరికాకు అన్యాయం జరుగుతోంది. ఏప్రిల్ 2 నుంచి ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయి. వాళ్లు మనపై ఎంత ట్యాక్స్ విధిస్తారో, మనం కూడా వాళ్లపై అంతే ట్యాక్స్ విధిస్తాం’ అని పేర్కొన్నారు. 

దేనికైనా సిద్ధం: చైనా

కెనడా, మెక్సికోలపై అమెరికా విధించిన 25 శాతం టారిఫ్‌లు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే చైనా ఉత్పత్తులపై విధి స్తున్న 10శాతం సుంకాలను 20 శాతానికి పెంచుతూ ఇచ్చిన ఆదేశాలు కూడా మంగళవా రం నుంచే అమలులోకి వచ్చాయి. ఈ క్రమం లో అమెరికాలోని చైనా రాయబార కార్యాల యం ఘాటుగా స్పందించింది.

‘అమెరికా యుద్ధాన్ని కోరుకుంటే, అది సుంకాల యుద్ధమైనా, వాణిజ్య యుద్ధమైనా, లేక మరేరకమైన యుద్ధమైనా చివరి వరకూ పోరాడటానికి మే ము సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. చైనా దిగుమతులపై సుంకాలను పెంచడానికి ఫెంటానిల్‌ను అమెరికా సాకుగా చూపిస్తుందని దుయ్యబట్టింది.

తమ సాయా న్ని గుర్తించడానికి బదులుగా అమెరికా నింద లు వేస్తుందని అసహనం వ్యక్తం చేసింది. సుంకాల పెంపు ద్వారా ఒత్తిడి తెచ్చి తమను బ్లాక్ మెయిల్ చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అయితే బెదిరింపులకు భయపడేది లేదని చైనా స్పష్టం చేసింది.

తమ పై విధించిన సుంకాలకు ప్రతీకారంగా అమెరి కా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 10 శాతం సుంకాలను చైనా విధించింది. మొన్నజొన్న, పత్తి, గోధుమ వంటి అమెరికా వ్యవసా య, ఆహార ఉత్పత్తులపై విధించిన ఈ టారిఫ్ లు మార్చి 10 నుంచి అమలులోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై ఫిర్యాదు చేసింది. 

యుద్ధానికి సిద్ధం: చైనా

అమెరికా యుద్ధాన్ని కోరుకుం టే, అది సుంకాల యుద్ధమైనా, వాణిజ్య యుద్ధమైనా, లేక మరేరకమైన యుద్ధమైనా చివరివరకూ పోరుకు మేము సిద్ధంగా ఉన్నాం.

డబ్ల్యూటీవోలో కెనడా ఫిర్యాదు

కెనడా నుంచి అమెరికాలోకి సరఫరా అవుతున్న ఫెంటానిల్‌కు అడ్డుకట్ట వేయడంతో అక్కడి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కెనడా ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్‌లు విధించింది. దీంతో కెనడా ప్రభుత్వం ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 107 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. 

అంతేకాకుండా అన్యాయమైన సుంకాలపై వాషింగ్టన్‌తో చర్చించేందుకు కెనడా ప్రభుత్వం ప్రపంప వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో ఫిర్యాదు చేసింది. కాగా అమెరికా విధించిన దిగుమతి సుంకాలపై త్వరలోనే స్పందించనున్నట్టు మెక్సికో అధ్యక్షురాలు క్లుడియా షీన్‌బామ్ ఓ ప్రకటనలో తెలిపారు.