08-04-2025 01:24:42 AM
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గ్లోబ ల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు తెలంగాణ హబ్ రూపొందిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటీ ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు భాగ్యనగరంలో ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు.
కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్‌పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌కి హబ్‌గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భం గా మంత్రి శ్రీధర్‌బాబు వారికి వివరించారు.
ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొనేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దు తామని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్‌సిటీ, అక్కడే ఏర్పాటు చేయబోతున్న ఏఐ యూనివర్శిటీ గురించి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యమయ్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థ లు ముందుకొచ్చాయని పేర్కొన్నారు.
పరిశ్రమల ఏర్పాటు ఒక్క హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రొత్సహిస్తున్నామన్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలపై స్థానిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని ప్రతినిధుల బృందాన్ని కోరారు.
టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. సమావేశంలో కాన్సూల్ వైష్ణవి వాసుదేవన్, ఫస్ట్ సెక్రటరీ(ఎకనామిక్) వివేక్ రఘురామన్, ఎంటర్‌ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్ (సౌత్ ఇండియా) డేనిస్ టామ్ తదితరులు పాల్గొన్నారు.