calender_icon.png 2 January, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్గెట్ తెలంగాణ!

30-12-2024 01:14:00 AM

  1. రాష్ట్రంలో రీఎంట్రీకి తెలుగుదేశం తహతహ 
  2. మాజీ నేతలను దగ్గరకు తీసుకుంటున్న టీడీపీ బాస్
  3. రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు 
  4. వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా మారాలని వ్యూహాలు

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో క్రమంగా కనుమరుగైపోయిన తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో ఎలాగైనా తిరిగి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకు నాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే చాపకింద నీరులా నెమ్మదిగా అడుగులు వేస్తోంది.

ఇప్పటికే ఓసారి తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అంతర్గతంగా వ్యూహాలు పన్నుతున్న ట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం అనే మాటే లేకుండా పోయింది.

2014లో 15 ఎమ్మెల్యే సీట్లు, మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంతో పాటు 2018లో రెండు ఎమ్మెల్యే స్థానాలు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయాయి. అయితే తమకు తెలంగాణలో బీసీల నుంచి బలమైన మద్దతు ఉందని భావిస్తున్న టీడీపీ.. తాజాగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా సాగిస్తోంది.

బడుగు, బలహీనవర్గాల ప్రజలకు టీడీపీయే అండ అనే నినాదంతో ఆ పార్టీ నేతలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరోవైపు తెలంగాణలో ఎలాగైనా తిరిగి పాగా వేయాలని భావిస్తున్న పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రాష్ట్రానికి చెందిన నేతలతో లోలోపల మంతనాలు సాగిస్తున్నారని వినికిడి.

ఇటీవల లోకేశ్ పొలిటికల్ స్ట్రాటెజిస్టులు అయిన పీకే, రాబిన్‌శర్మతో ఈ అంశంపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీని కాదని కొందరు టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బాబూ మోహన్ ఆ పార్టీలో చేరగా, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి సైతం టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.

అయితే వీరితే పాటు పలువురు నేతలు చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఎవరెవరు అనేది మాత్రం వారు వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు పాత నేతల కంటే యువతపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు.

పూర్వవైభవం కోసం వ్యూహాలు..

తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేసే బాధ్యతను ప్రశాంత్ కిశోర్‌తో పాటు షో టైమ్ కన్సల్టింగ్‌కు చెందిన రాబిన్ శర్మకు అప్పగించినట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజిస్ట్‌గా పని చేయకోపోయినా ఐడియాలు మాత్రం ఇస్తున్నారు. రాబిన్ శర్మ గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేశారు.

ఈ క్రమంలో వారు తెలంగాణలో చతికిలాపడిన టీడీపీకి మళ్లీ ఊపిరి పోయడానికి అంతర్గతంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు నివాసంలో పీకే, రాబిన్ శర్మ హైలెవల్ మీటింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌కు వారు తెలంగాణలో పార్టీ పూర్వ వైభవానికి తీసుకోవాల్సిన వ్యూహాలను వివరించినట్లు చర్చ జరుగుతోంది.

పలు వర్గాల్లో టీడీపీకి ఉన్న అభిప్రాయాలతో పాటు మళ్లీ టీడీపీ వస్తే తెలంగాణ సెంటిమెంట్ పెరుగుతుందా లేదా అన్న అంశాలపైనా సర్వే చేసినట్లుగా చెబుతున్నారు. ఆ ఫలితాల ఆధారంగా సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. బలమైన నాయకత్వం ఉంటే పాత కేడర్ తిరిగి వస్తుందని ఓటర్లు కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నట్టు సమాచారం.

ముందు ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆ తర్వాత నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, గ్రేటర్ పరిధిలో పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చిస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారిని గుర్తించి వారిని తిరిగి దగ్గరికి తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మాజీమంత్రి బాబు మోహన్ పార్టీలో చేరగా, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది.

వీరితో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీమంత్రి మల్లారెడ్డి సహా గ్రేటర్‌లోని పలువురు ముఖ్య నేతలు సైతం టీడీపీ వైపు చూస్తున్నారని చర్చ జరుగుతోంది. వీరితో పాటు చాలా మంది లైన్‌లో ఉన్నారనే టాక్ నడుస్తోంది. గతంలో టీడీపీలో  ఓ వెలుగు వెలిగిన వారు చాలా మంది తిరిగి టీడీపీ మనుగడలోకి వస్తే బాగుండనే ఉద్ధేశంతో ఉన్నారని, అలాంటి వారిని గుర్తించే పనిలో పార్టీ నేతలు ఉన్నారని చర్చ జరుగుతోంది. 

రేవంత్‌రెడ్డి కూడా మావాడే..

తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి మావాడే అనే విధంగా తెలుగుదేశం కేడర్ మాట్లాడుతోంది. రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి మనుగడ లేదని భావించాకే రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళ్లారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికీ టీడీపీ నేతలకు రేవంత్‌రెడ్డితో మంచి సంబంధాలే ఉన్నాయని అంటున్నారు.

2014లో 15 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న టీడీపీ.. ఐదేళ్ల తర్వాత రెండు స్థానాలకు పడిపోయింది. ఆ తర్వాత 2023లో కనీసం పోటీ చేయలేదు. అయితే జనాల్లో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు తమపై లేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు తమదీ అందరిలా ఓ రాజకీయ పార్టీ అని రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో సెటిల్ అయిన సీమాంధ్ర ప్రజల ఓట్లతో పాటు తమపై అభిమానం ఉన్న ఓటర్లు ఇంకా తెలంగాణలో చాలా మంది ఉన్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఒక్కసారిగా తాము అధికారంలోకి రాకపోయినా ఉనికి చాటుకుంటూ ముందుకు సాగుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అందుకు గాను ముందు కొందరు బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తామని టీటీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబును నమ్ముకుంటే రాజకీయంగా బాగా ఎదదొచ్చని చెప్పేందుకు అనేక ఉదాహరణ లున్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అందుకే చాలా మంది తప్పనిసరిగా ఘర్ వాపసీకి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. 

రెండునెలల్లో 1.20 లక్షల సభ్యత్వాలు 

తెలంగాణ టీడీపీ పాత నేతలతో పాటు యువతపై ప్రత్యేక దృష్టి సారిం చాం. సభ్యత్వాల్లోనూ వారికే ప్రాధా న్యం ఇచ్చాం. ఇప్పటికే రెండు నెలల్లో 1.20 లక్షల సభ్యత్వాలను నమోదు చేశాం. పార్టీకి ఉన్న సానుభూతిపరులు, అభిమానులు పార్టీ మరో సారి అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారు. అధికారం కోసం మేమేమీ వెంపర్లాడటం లేదు.

క్రమంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తాం. ఇప్పటికీ గ్రామాల్లో పార్టీని వీడకుండా అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. పార్టీ తిరిగి రావాలని వారంతా బలంగా కోరుకుంటున్నారు. తమపై నమ్మకం ఉండి పార్టీలోకి వచ్చే వారికి తగిన ప్రాధాన్యం తప్పకుండా లభించేలా చూస్తాం.

బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే టీడీపీతోనే సాధ్యం. ఆ వర్గాలకు రాజకీయం గా ప్రాధాన్యం ఇచ్చిందే టీడీపీ. అందుకే టీడీపీ తిరిగి పుంజుకుంటుందనే బలమైన విశ్వాసం ఉంది.

 బక్కని నర్సింహులు, 

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి