- చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి
- ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు
- హెచ్‌ఎంలు, టీచర్లకు రాష్ట్రవిద్యాశాఖ మార్గదర్శకాలు
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులు వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు రాష్ట్ర విద్యాశాఖ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నది. గత అనుభవాలు, ఫలితాలను పరిగణలోకి తీసుకుని హెచ్‌ఎంలు, టీచర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రతిరోజు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని, తద్వారా వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా సూచించింది. జనవరి 10 లోపు సిలబస్ పూర్తి చేసి, ప్రతిరోజూ స్పెషల్ టైమ్ టేబుల్ అమలు చేయాలని పేర్కొన్నది.
సబ్జెక్ట్ టీచర్లు వారి సబ్జెక్టులకు సంబంధించిన స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించింది. డీఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు పాఠశాలల్లో అమలవుతున్న యాక్షన్ ప్లాన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించింది.
స్లో లెర్నర్లపై ప్రత్యేక శ్రద్ధ..
పదోతరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులు (స్లో లెర్నర్లు) ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా బాటలు వేయాలని విద్యాశాఖ సూచించింది. దీనిలో భాగంగానే ఉపాధ్యాయులు ప్రతిరోజు గంటపాటు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మొదటి 20 నిమిషాలు పాఠంలోని ముఖ్య మైన అంశాలు, ప్రశ్నలు, జవాబుల గురించి వివరిస్తున్నారు.
మిగిలిన 40 నిమిషాల్లో విద్యార్థులతో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో మోడల్ స్కూళ్లలో 95.06 శాతం, కేజీబీవీల్లో 93.06 శాతం, ఎయిడెడ్‌లో 88.61 శాతం, జిల్లా పరిషత్‌లో 86.03 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 80.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి వందకు వందశాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ కృషి చేస్తున్నది.
ఫలితాల సాధనకు కార్యాచరణ
అభ్యాస దీపిక ప్రశ్నలను విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలి. పూర్తయిన సిలబస్‌లో ప్రతిరోజూ ఒక పాఠం/టాపిక్‌ను వివరించాలి. మరుసటి రోజు ఆ పాఠం టెస్ట్ పెట్టాలి. మూడో రోజు ప్రశ్నపత్రాన్ని వివరించాలి. విద్యార్థుల తప్పులను గుర్తించి, పరీక్షలో జవాబులు సరిగా రాసేలా గైడ్ చేయాలి. మంచి మార్కుల సాధనలో చేతిరాత ముఖ్యం కాబట్టి, విద్యార్థులు చేతిరాత మెరుగు పరుచుకునేందుకు ప్రోత్సహించాలి.
పేపర్ల మూల్యాంకనంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. గత సంవత్సరం పాత ప్రశ్నపత్రాలు, వాటికి జవాబులను విశ్లేషించి చెప్పాలి. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించాలి. వాటి అనుగుణంగా మంచి మార్కులు సాధించేందుకు ప్రోత్సహించాలి. సగటు విద్యార్థులు సైతం మంచి ఫలితాలు సాధించేందుకు చొరవ చూపాలి. విద్యార్థులతో టీథూ పాఠాలు వినిపించాలి.
ప్రతి టీచర్ కొంత మంది విద్యార్థులను దత్తత తీసుకోవాలి. వారి తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి. పిల్లల సామర్థ్యంపై వారితో చర్చించాలి. హాస్టల్ వార్డెన్లతోనూ విద్యార్థుల సామర్థ్యంపై చర్చించాలి. పిల్లల కోసం మోటివేషనల్ క్లాసులు నిర్వహించాలి.
మానసిక ఒత్తిడి, పరీక్షలంటే భయం పోయేలా స్పెషల్ గెస్టులను ఆహ్వానించాలి. కౌన్సిలింగ్ అవసరమైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. ప్రీ ఫైనల్ పరీక్షలు టైం టేబుల్ ప్రకారం ఫిబ్రవరిలోనే నిర్వహించాలి. ఫలితాలను బట్టి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు అనుసరించాల్సిన విధానాలను వివరించాలి.