calender_icon.png 16 January, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురి కుదిరింది

26-07-2024 05:25:10 AM

  1. ఆర్చర్లు అదుర్స్
  2. క్వార్టర్స్ బెర్తు ఖరారు

ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాకముందే భారత ఆర్చర్ల బృందం విశ్వక్రీడల్లో తమ ప్రదర్శనతో 

అదరగొట్టింది. ఆర్చరీ టీమ్ రికర్వ్ విభాగంలో పురుషుల, 

మహిళల బృందాలు క్వార్టర్స్‌లో అడుగుపెట్టి పతకంపై ఆశలు రేపుతున్నాయి. కోపా అమెరికా కప్‌ను గెలిచి జోరు మీదున్న అర్జెంటీనాకు మొరాకో షాక్ ఇవ్వగా.. యూరోకప్ విజేత 

స్పెయిన్ శుభారంభం చేసింది. ఇక వందేళ్ల తర్వాత విశ్వక్రీడలకు ఆతిథ్యమిస్తున్న పారిస్‌లో నేడు అధికారికంగా ఒలింపిక్స్‌కు 

తెరలేవనుండగా.. అట్టహాసంగా ఆరంభ వేడుకలకు 

సీన్ నది ముస్తాబైంది!

పారిస్: ఒలింపిక్స్ ఆరంభానికి ఒకరోజు ముందే భారత ఆర్చర్లు అదరగొట్టారు. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్, ప్రవీణ్ జాదవ్ బృందం క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. టీమ్ విభాగంలో ర్యాంకింగ్ రౌండ్‌లో ధీరజ్ త్రయం 2013 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. విజయవాడ ఆర్చర్ ధీరజ్ వ్యక్తిగత విభాగంలోనూ అదుర్స్ అనిపించాడు. 681 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలవగా.. తరుణ్ దీప్ (674 పాయింట్లు), ప్రవీణ్ (658 పాయింట్లు) వరుసగా 14, 39వ స్థానాల్లో నిలిచారు.

మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో దీపికా కుమారి, భజన్ కౌర్, అంకిత త్రయం క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఉదయం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత్ 1983 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా 2046 పాయింట్లతో టాప్ స్థానంలో నిలవగా.. చైనా (1996 పాయింట్లు), మెక్సికో (1986 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. క్వాలిఫికేషన్‌లో టాప్ నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోనున్నాయి. 5 నుంచి 12 స్థానాల్లో నిలిచిన జట్లు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ఆడతాయి. జూలై 28న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో భారత్.. ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఒకవేళ క్వార్ట ర్స్‌లో గెలిస్తే సెమీస్‌లో టాప్ సీడ్ దక్షిణకొరియాను ఎదుర్కోనుంది.

ఒలింపిక్స్ చరి త్రలో దక్షిణకొరియా ఆర్చరీలో ఇప్పటివరకు 27 స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. ఆర్చర్ల వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగానే టీమ్ సీడింగ్స్ కేటాయించడం జరుగుతుంది. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో అంకిత మంచి ప్రదర్శన కనబరిచింది. క్వాలిఫికేషన్ రౌండ్ లో 666 పాయింట్లు సాధించిన అంకిత 11వ స్థానంలో నిలవగా.. భజన్ కౌర్ (559 పాయింట్లు) 22వ స్థానంలో, దీపికా (558 పాయింట్లు) 23వ స్థానాల్లో నిలిచారు. వ్యక్తిగత విభాగాల్లో మంచి ప్రదర్శన కనబరిచిన అంకిత, ధీరజ్ జోడీ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో 1347 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.